‘జయ’ సేన ఆగ్రహజ్వాల | Jayalalithaa's conviction a rude shock for partymen | Sakshi
Sakshi News home page

‘జయ’ సేన ఆగ్రహజ్వాల

Published Sun, Sep 28 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

‘జయ’ సేన ఆగ్రహజ్వాల

‘జయ’ సేన ఆగ్రహజ్వాల

 సాక్షి, చెన్నై : ఆదాయూనికి మించిన ఆస్తుల కేసులో జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ బృందానికి ఎలాంటి తీర్పు వెలువడుతుందోనన్న నరాలు తెగే ఉత్కంఠ ఉదయం నుంచి రాష్ట్రంలో నెలకొంది. బెంగళూరు కోర్టు విచారణ నిమిత్తం సరిగ్గా ఎనిమిదిన్నర గంటలకు నెచ్చెలి శశికళ, బంధువు ఇలవరసితో కలసి ఒకే వాహనంలో జయలలిత మీనంబాక్కం విమానాశ్రయూనికి బయలు దేరారు. ఆమె కాన్వాయ్ మార్గంలో మునుపెన్నడూ లేని రీతిలో భద్రతా చర్యలు తీసుకున్నారు. బెంగళూరు కోర్టుల్లో సరిగ్గా 11 గంటలకు విచారణ ఆరంభం కాగా, అప్పటి నుంచే ప్రజలు టీవీలకు అతుక్కు పోయారు. రాష్ట్రంలో జయలలిత కేసు తీర్పు వివరాలు తెలుసుకోవాలన్న ఆత్రుతతో ప్రతి ఒక్కరూ ఎదురు చూశారు. అమ్మ నిర్దోషిగా బయటకు వస్తుందన్న ధీమాతో ఉన్నా, ఒంటి గంట సమయంలో జయలలిత అవినీతి కేసులో దోషి అంటూ తమిళ చానళ్లు మినహా తక్కిన ఇతర  న్యూస్ చానళ్లు వ్యూహాత్మకంతో ఫ్లాష్ న్యూస్‌లను ప్రకటించేశాయి. అయితే, తమిళ చానళ్లలో ఆ సమాచారం లేని దృష్ట్యా, అమ్మ నిర్దోషిగా బయటకు వస్తుందనన్న భావనలోనే అన్నాడీఎంకే వర్గాలు ఉన్నాయి.

 నిర్మానుష్యం : జయలలిత దోషి అన్న ప్రచారం ఊపందుకోవడంతో ఒక్క సారిగా రాష్ర్టంలో వాతావరణం మారుతూ వచ్చింది. దుకాణాల్ని స్వచ్ఛందంగా కొన్ని చోట్ల మూసి వేశారు. రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి. కొన్ని కూడళ్లల్లో పోలీసులు రంగంలోకి దిగారు. సరిగ్గా మూడు గంటలకు తీర్పు వెలువడుతుందంటూ టీవీల్లో వార్తలు రావడంతో, ఆ తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ప్రధాన నగరాల్లో ఎక్కడికక్కడ బస్సుల్ని నిలుపుదల చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. కొన్ని బస్సులు ఇతర రూట్లలో నడుస్తుండడంతో, ఆ డ్రైవర్లను అప్రమత్తం చేశారు. అనేక ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లోని భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రధానంగా డీఎంకే కార్యాలయాల వద్ద భద్రతను పెంచుతూ చర్యలు తీసుకున్నారు.
 
 ఆగ్రహ జ్వాల:  సరిగ్గా రెండున్నర గంటల సమయంలో జయలలిత దోషి అంటూ తమిళ చానళ్లు సైతం ప్రసారం చేయడంతో వాతావరణం వేడెక్కింది. ఎక్కడికక్కడ అన్నాడీఎంకే వర్గాలు రెచ్చి పోయారుు. తమ అధినేత్రికి జైలు శిక్ష తప్పదన్న విషయాన్ని గ్రహించి ఆగ్రహానికి లోనైన అభిమానులు తెరచి ఉన్న దుకాణాలపై దాడులకు దిగారు. రోడ్ల మీద వెళుతున్న కార్లు, పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిళ్లపై తమ ప్రతాపం చూపించారు. చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, తిరునల్వేలి, మదురై, తూత్తుకుడి, తంజావూరు తదితర నగరాల్లో మరింతగా వీరంగం సృష్టించారు. డీఎంకే వర్గాల ఇళ్లపై, కార్యాలయాలపై రాళ్లు రువ్వే పనిలో పడ్డారు. పోలీసులు వారించే యత్నం చేసినా ఏ మాత్రం తగ్గలేదు.
 
 కొన్ని చోట్ల డీఎంకే ఫ్లెక్సీలను తగుల బెట్టారు. ప్రైవేటు సంస్థలపై రాళ్లతో దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొన్ని చోట్ల పోలీసులు చోద్యం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అన్నాడీఎంకే  నాయకులందరూ బెంగళూరుకు తరలి వెళ్లడంతో కార్యకర్తల్ని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని కట్టడిచేసే వారు కరువయ్యారు. ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీద బైఠాయించడంతో పాటుగా, అటు వైపుగా వచ్చిన బస్సులు వాహనాలపై తమ ప్రతాపం చూపించడంతో పలు చోట్ల పోలీసులు లాఠీలు ఝుళిపించారు. జయలలిత నియోజకవర్గం శ్రీరంగంలో దుకాణాలకు  నిప్పు పెట్టారు. కాంచీపురంలో ఓ బస్సుకు నిప్పు పెట్టగా, మరి కొన్ని చోట్ల సుమారు వందకు పైగా బస్సులపై ప్రతాపం చూపించారు. జయలలితపై పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత సుబ్రమణ్య స్వామిపై ఇంటిపై దాడికి యత్నించారు. ఆయన చిత్ర పటాల్ని, దిష్టిబొమ్మల్ని దహనం చేశారు.  సాయంత్రానికి నగరాల్లోని రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి. జనం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టేందుకు వెనకడుగు వేయాల్సి వచ్చింది.
 
 రంగంలోకి గవర్నర్: రాష్ర్టంలో పరిస్థితి అదుపు తప్పుతుండడంతో రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య రంగంలోకి దిగారు. దీంతో ఎక్కడికక్కడ ఆందోళన కారుల్ని అణచివేస్తూ, అరెస్టులకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. కొ న్ని చోట్ల ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు తీవ్రంగానే లాఠీలు ఝుళిపించారు. రాష్ట్రంలో ని అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాం గం ఆగమేఘాలపై రాజ్ భవన్‌కు పరుగులు తీశాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ రోశయ్య పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీ కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహనవర్గీస్, డీజీపీ రామనుజం తదితర అధికారులతో భద్రతపై సమీక్షించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వలయంలోకి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. వాతావరణం వేడెక్కడంతో ఎక్కడికక్కడ ప్రైవేటు, ప్రభుత్వ బస్సులు ఆగిపోయూయి. ముందుస్తుగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్లు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. చెన్నై నగరంలో పూర్తి స్థాయిలో పలు మార్గాల్లో నగర బస్సుల రాకపోకలు ఆగిపోయూయి. ఎలక్ట్రిక్ రైళ్లు భద్రత నడుమ కదిలాయి.
 
 కరుణ ఇంటిపై దాడికి యత్నం
 తమ అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడటంతో అన్నాడీఎంకే వర్గాలు కరుణానిధి ఇంటిపై దాడికి యత్నించాయి. గోపాలపురంలోని కరుణానిధి ఇంటి వైపుగా అన్నాడీఎంకే కార్యకర్తలు దూసుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. తామెమీ తక్కువ తిన్నామా అన్నట్టు డీఎంకే వర్గాలు ప్రతిదాడికి పరుగులు తీయడంతో పరిస్థితి అదుపు తప్పింది. సకాలంలో పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితిని చక్కదిద్దారు.
 
 మీడియాపై దాడి  
 అన్నాడీఎంకే వర్గాలు తమ ఆగ్రహాన్ని మీడియాపై కూడా చూపించారుు. పోయెస్ గార్డెన్ వద్ద విధుల్లో ఉన్న ఆంగ్ల ఛానల్‌పై విరుచుకుపడ్డారు. జయలలితకు సంబంధించిన కథనంతో ప్రత్యక్ష ప్రసారంలో నిమగ్నమైన ఎన్‌డీటీవీ మహిళా జర్నలిస్టుపై అన్నాడీఎంకే మహిళలు తమ ఆగ్రహాన్ని చూపించారు. కెమెరామెన్‌పై దాడికి దిగారు. పక్కనే ఉన్న న్యూస్ ఎక్స్ చానల్ సిబ్బందిపై కూడా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. రెండు కెమెరాలను ధ్వంసం చేశారు. ఓబీ వ్యాన్‌పై దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనను మీడియా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మద్రాసు రిపోర్టర్స్ గిల్డ్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే సింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement