‘మా ప్రాణాలకు ముప్పు’
‘మా ప్రాణాలకు ముప్పు’
Published Wed, Jan 15 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
న్యూఢిల్లీ: పటిష్ట భద్రత కలిగిన తీహార్ కారాగారంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సంస్థ సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్‌లు ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) కోర్టు న్యాయమూర్తి ఐఎస్ మెహతాకు బుధవారం దరఖాస్తు చేసుకున్నారు. తాము హత్యకు గురవుతామంటూ తీహార్ జైలు సూపరింటెండెంట్ తమను హెచ్చరించాడని, తమ విషయంలో జైలు అధికారుల వైఖరి దారుణంగా ఉందని అందులో పేర్కొన్నారు.
తమను శత్రువుల కంటే ఘోరంగా చూస్తున్నారన్నారంటూ వారిరువురూ తమ దరఖాస్తులో తెలిపారు. ఈ నేపథ్యంలో తాము తీవ్ర భయాందోళనలకు గురువుతున్నామన్నారు. తీహార్ కారాగారంలో తమకు తగినంత భద్రత క ల్పించాలని డెరైక్టర్ జనరల్‌ను ఆదేశించాల్సిందిగా విన్నవించారు. ఈ విన్నపాన్ని పరిశీలించిన కోర్టు ఈ నెల 17వ తేదీలోగా ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటై తీహార్ కారాగార అధికారులను ఆదేశించింది. జ్యుడిషియల్ కస్టడీ కింద యాసిన్ భత్కల్, అఖ్తర్‌లను పోలీసులు తీహార్ కారాగారానికి తరలించిన విషయం విదితమే.
మాకు అప్పగించండి: ఎన్‌ఐఏ
ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సంస్థ సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను తమకు అప్పగించాలని ఎన్‌ఐఏ కోర్టును అభ్యర్థించారు. 2010, ఏప్రిల్ 17వ తేదీన బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి విదితమే. ఈ ఘటనలో భత్కల్ ప్రమేయం ఉందని అనుమానించిన అక్కడి పోలీసులు కేసు నమోదుచేశారు. రాయల్ చాలెంజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుందనగా ఈ ఘటన జరిగింది.
ఈ కేసుకు సంబంధించి బెంగళూర్‌లోని మెజిస్ట్రేట్ కోర్టు... భత్కల్‌పై ప్రొడక్షన్ వారంట్ జారీచేసిందని కర్ణాటక పోలీసులు స్థానిక న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 15 మంది గాయపడిన సంగతి విదితమే. క్షతగాత్రుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. కర్ణాటక పోలీసుల అభ్యర్థనను ఆలకించిన కోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
Advertisement