Mujahideen
-
పాకిస్తాన్.. వాట్సాప్ గ్రూప్ హల్ చల్
సాక్షి, చెన్నై: పాకిస్తాన్ ముజాహిద్దీన్ పేరిట వాట్సాప్ గ్రూప్ కోయంబత్తూరులో హల్చల్ చేస్తుండడం వెలుగులోకి వచ్చింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, ఉత్తరాది ఆ యువకుడికి కోయంబత్తూరులోని చిరునామాతో ఆధార్, రేషన్ కార్డులు సైతం జారీ చేసి ఉండడం పోలీసుల్ని విస్మయంలో పడేసింది. ఈ కార్డులు ఆ యువకుడికి ఎలా వచ్చాయో అన్న కోణంలోనూ విచారణను వేగవంతం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కాలంగా చాపకింద నీరులా సాగుతూ వస్తున్న ఐసిస్ మద్దతుదారుల కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో సాగిన బాంబు పేలుళ్ల అనంతరం ఎన్ఐఏ వర్గాల దృష్టి తమిళనాడుపై పడింది. తరచూ ఇక్కడ దాడులు నిర్వహించడం ఐసిఎస్ మద్దతు దారుల్ని పట్టుకెళ్లడం జరుగుతోంది. అలాగే, నిషేధ తీవ్రవాద సంస్థల పేరిట సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న వ్యవహారాల్ని గుర్తించి విచారణలు ముమ్మరం చేశారు. ప్రధానంగా కోయంబత్తూరు చుట్టూ ఎన్ఐఏ వర్గాల విచారణలు, దాడులు ముమ్మరం చేసి ఉన్న తరుణంలో గత నెలాఖరులో తీవ్రవాదులు చొరబడ్డ సమాచారం ఉత్కంఠను రేపింది. కోయంబత్తూరులో జల్లెడ పట్టి మరీ గాలింపు సాగింది. సముద్ర మార్గంలో తమిళనాడులోకి తీవ్ర వాదులు ప్రవేశించి ఉన్నట్టుగా కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో ప్రధాన నగరాల్లో పోలీసుల యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తూ వస్తున్నది. ఈనేపథ్యంలో పాకిస్తాన్ ముజాహిద్దీన్ పేరిట వాట్సాప్ గ్రూప్ హల్చల్ చేస్తుండడం వెలుగులోకి రావడంతో కోయంబత్తూరులో భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఓ సెల్‌ఫోన్ సర్వీసు సెంటర్లో పనిచేస్తున్న వ్యక్తి గుర్తించే వరకు పోలీసులు కూడా ఈ వ్యవహారాన్నిపసిగట్ట లేని పరిస్థితి ఉండడం గమనార్హం. సెల్‌ఫోన్ ద్వారానే వెలుగులోకి.. కోయంబత్తూరులో ఉన్న ఓ నగల తయారీ కర్మాగారంలో ఫారూక్ కౌశర్ అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఇతడి ఆండ్రాయిడ్ ఫోన్ మరమ్మతులకు గురైంది. దీనిని నగరంలోని ఆర్ఎస్ పురంలో ఉన్న ఓ సెల్ ఫోన్ సర్వీసు సెంటర్లో ఇచ్చాడు. ఆ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బంది ఆ ఫోన్‌కు మరమ్మతులు పూర్తి చేశారు. ఆ సెల్‌ఫోన్ పనిచేయడంతో అందులో ఉన్న యాప్స్‌ను పరిశీలించాడు. అందులో పాకిస్తాన్ ముజాహిద్దీన్ పేరిట ఓ వాట్సాప్ గ్రూప్ ఉండడం, అందులో ప్రధానంగా తుపాకులు, ఆయుధాల ఫొటోలు, వాటి తయారీ గురించిన సమాచారాలు ఉండడంతో అనుమానాలు బయలు దేరాయి. అలాగే, ఆ సెల్ ఫోన్లోని గూగుల్ సెర్చ్‌లోనూ తుపాకీల తయారీ గురించే అధికంగా సెర్చ్ జరిగి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. కోయంబత్తూరు పోలీసులు ఆ సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. అందులో ఉన్న ఫొటోలు, వాట్సాప్ గ్రూప్‌ను తనిఖీలు చేశారు. ఆ నగల కర్మాగారంలో ఉన్న ఫారూక్ కౌశర్ (28)ను ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అతగాడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు. అతడి వద్ద కోయంబత్తూరు చిరునామాతో ఆధార్ , రేషన్ కార్డు సైతం ఉండడంతో అవి ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నారు. రహస్య ప్రదేశంలో ఉంచి అతడి వద్ద విచారణ సాగుతోంది. అలాగే, పాకిస్తాన్ ముజాహిద్దీన్ పేరిట వాట్సాప్ గ్రూప్‌ను నడుపుతున్న వ్యక్తి, అందులోఉన్న వారి వివరాలను సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా సేకరించి, ఆయా ప్రాంతాల్లోని పోలీసుల ద్వారా విచారణను వేగవంతం చేశారు. -
‘మా ప్రాణాలకు ముప్పు’
న్యూఢిల్లీ: పటిష్ట భద్రత కలిగిన తీహార్ కారాగారంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సంస్థ సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్‌లు ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) కోర్టు న్యాయమూర్తి ఐఎస్ మెహతాకు బుధవారం దరఖాస్తు చేసుకున్నారు. తాము హత్యకు గురవుతామంటూ తీహార్ జైలు సూపరింటెండెంట్ తమను హెచ్చరించాడని, తమ విషయంలో జైలు అధికారుల వైఖరి దారుణంగా ఉందని అందులో పేర్కొన్నారు. తమను శత్రువుల కంటే ఘోరంగా చూస్తున్నారన్నారంటూ వారిరువురూ తమ దరఖాస్తులో తెలిపారు. ఈ నేపథ్యంలో తాము తీవ్ర భయాందోళనలకు గురువుతున్నామన్నారు. తీహార్ కారాగారంలో తమకు తగినంత భద్రత క ల్పించాలని డెరైక్టర్ జనరల్‌ను ఆదేశించాల్సిందిగా విన్నవించారు. ఈ విన్నపాన్ని పరిశీలించిన కోర్టు ఈ నెల 17వ తేదీలోగా ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటై తీహార్ కారాగార అధికారులను ఆదేశించింది. జ్యుడిషియల్ కస్టడీ కింద యాసిన్ భత్కల్, అఖ్తర్‌లను పోలీసులు తీహార్ కారాగారానికి తరలించిన విషయం విదితమే. మాకు అప్పగించండి: ఎన్ఐఏ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సంస్థ సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను తమకు అప్పగించాలని ఎన్ఐఏ కోర్టును అభ్యర్థించారు. 2010, ఏప్రిల్ 17వ తేదీన బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి విదితమే. ఈ ఘటనలో భత్కల్ ప్రమేయం ఉందని అనుమానించిన అక్కడి పోలీసులు కేసు నమోదుచేశారు. రాయల్ చాలెంజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుందనగా ఈ ఘటన జరిగింది. ఈ కేసుకు సంబంధించి బెంగళూర్‌లోని మెజిస్ట్రేట్ కోర్టు... భత్కల్‌పై ప్రొడక్షన్ వారంట్ జారీచేసిందని కర్ణాటక పోలీసులు స్థానిక న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 15 మంది గాయపడిన సంగతి విదితమే. క్షతగాత్రుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. కర్ణాటక పోలీసుల అభ్యర్థనను ఆలకించిన కోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. -
భత్కల్. ఆధునిక ఉగ్రవాదానికి చిరునామా
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆధునిక కాల ఉగ్రవాదానికి చిరునామాగా ముద్రపడిన జరార్ అహ్మద్ సిద్దిబాబా అలియాస్ యాసిన్ భత్కల్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా భత్కల్‌లో 1983లో జన్మించాడు. అంజుమన్ హమి-ఇ-ముస్లిమీన్ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తదనంతర కాలంలో శిక్షణ పొందిన ఇంజనీర్‌గా, బాంబుల నిపుణుడిగా ఐఎంలోని ఇతర సభ్యులకు పరిచయమయ్యాడు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో ఆ దేశంలో ఆశ్రయం పొందుతున్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లకు యాసిన్ భత్కల్ వరుసకు సోదరుడు. రియాజ్, ఇక్బాల్ ఇద్దరూ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారు. పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న వీరిద్దరి కుటుంబసభ్యులు ఇప్పటికీ భత్కల్‌లోని మదీనా కాలనీలోనే నివాసం ఉంటున్నారు. యాసిన్ రియాజ్ భత్కల్‌తో కలిసి ఇండియన్ ముజాహిదీన్‌ను ఏర్పాటు చేశాడు. రియాజ్ షాబందరి, అబ్దుల్ సుభాన్ ఖురేషి, సాదిక్ ఇశ్రార్ షేక్, టైస్టుగా మారిన గ్యాంగ్‌స్టర్ అమీర్ రెజా ఖాన్లు వీరి సహచరులుగా ఉన్నారు. పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ నుంచి దీనికి పూర్తి సహాయ సహకారాలున్నాయి. ఈ నేపథ్యంలో భత్కల్ నుంచి పుణేకు మకాం మార్చిన యాసిన్ ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొన్నాడు. ఐఎం భారతదేశ చీఫ్‌గా పలు పేలుళ్లకు నేతృత్వం వహించాడు. వందల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి, గాయపడటానికి కారకుడయ్యాడు. 2008లో జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలో పేలుళ్ల ద్వారా యాసిన్ భత్కల్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఢిల్లీలో జరిగిన ఐదు వరుస పేలుళ్లలో 30 మంది చనిపోయారు. 2008 మే 13న జైపూర్‌లో, జూలై 25న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో, అదేనెల 26న అహ్మదాబాద్‌లో, సెప్టెంబర్ 13న ఢిల్లీలో పేలుళ్లకు నేతృత్వం వహించాడు. 2010 ఫిబ్రవరి 13న పుణేలో జర్మన్ బేకరీలో పేలుడుకు, 2011 జూలై 13న ముంబైలో వరుస పేలుళ్లకు యాసిన్ ప్రధాన సూత్రధారి. ఈ ఏడాది ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్, గత జూలై 7న బుద్దగయలో చోటుచేసుకున్న వరుస పేలుళ్లకు కూడా యాసిన్ సూత్రధారి. ఈ క్రమంలో కొనసాగిన దర్యాప్తులోనే.. 2004లో కర్ణాటకలో పేలుడు పదార్థాల పంపిణీలో ఇతని పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. 2006లో ముంబైలో జరిగిన వరుస రైలు పేలుళ్లకు కూడా ఇతనే సూత్రధారి అనే అనుమానాలున్నాయి. ఈ పేలుళ్లలో 187 మంది మృత్యువాతపడ్డారు. యాసిన్‌తోపాటు అరెస్టైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన వాడు. ఇతను కూడా కాలాంతకుడు. 2011 జూలై 13న జరిగిన ముంబై సీరియల్ పేలుళ్లలో నేరుగా పాల్గొన్న 26 ఏళ్ల తబ్రేజ్ రిస్క్ ఆపరేషన్లు చేయడానికి ఉత్సాహం చూపుతాడనే పేరుంది. హైదరాబాద్ పేలుళ్లలో నేరుగా పాల్గొనడానికి కారణం అదే. పలుమార్లు తప్పించుకుని: ఐదేళ్లుగా దర్యాప్తు బృందాల కన్నుగప్పి తిరుగుతున్న యాసిన్ అనేకమార్లు దొరికినట్లేదొరికి తప్పించుకున్నాడు. 2009 డిసెం బర్ 29న కోల్‌కతా పోలీసులు దొంగనోట్ల కేసులో బల్లూ మాలిక్ అనే వ్యక్తిని అరెస్టుచేశారు. అతను కోర్టు నుంచి బెయిల్ తీసుకుని పారిపోయిన తరువాత అతనే యాసిన్భత్కల్ అని తేలింది. 2011లో చెన్నైలోని ఒక హోటల్లో తనిఖీలు జరుపుతుండగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. రాంచీలో వేరొక పేరుతో పాస్‌పోర్టు కోసం ప్రయత్నించి పోలీసులకు అనుమానం రావడంతో అక్కడనుంచి పరారయ్యాడు. గత ఏడాది బెంగళూరులో కూడా పోలీసుల నుంచి తప్పించుకున్నట్లు ఉగ్రవాది ఉబెయిద్-ఉర్-రెహ్మాన్ విచారణలో బయటపడింది. స్టూడెంట్ గుర్తింపు కార్డులతో పేలుళ్లకు ముందే మకాం వేయడం, స్వయంగా రెక్కీ నిర్వహించిన తరువాతే పేలుళ్లకు పాల్పడటం యాసిన్భత్కల్ స్టైల్. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు కూడా వారం రోజుల ముందుగానే నగరంలో ఆశ్రయం పొందినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది. యాసిన్ బాంబు పేలుళ్లకు పాల్పడిన తర్వాత పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు వెళ్లి ఆశ్రయం పొందేవాడ ని నిఘావర్గాల పరిశీలనలో బయటపడింది. ఉగ్రవాదుల గురువు టుండా అరెస్టు తరువాత కీలక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇండో-నేపాల్ సరిహద్దులలో పలువురు ఉగ్రవాద నేతలు అశ్రయం పొందుతున్నట్లు తేలింది.