సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆధునిక కాల ఉగ్రవాదానికి చిరునామాగా ముద్రపడిన జరార్ అహ్మద్ సిద్దిబాబా అలియాస్ యాసిన్ భత్కల్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా భత్కల్‌లో 1983లో జన్మించాడు. అంజుమన్ హమి-ఇ-ముస్లిమీన్ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తదనంతర కాలంలో శిక్షణ పొందిన ఇంజనీర్‌గా, బాంబుల నిపుణుడిగా ఐఎంలోని ఇతర సభ్యులకు పరిచయమయ్యాడు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ సహకారంతో ఆ దేశంలో ఆశ్రయం పొందుతున్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లకు యాసిన్ భత్కల్ వరుసకు సోదరుడు. రియాజ్, ఇక్బాల్ ఇద్దరూ ముంబైలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యారు. పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న వీరిద్దరి కుటుంబసభ్యులు ఇప్పటికీ భత్కల్‌లోని మదీనా కాలనీలోనే నివాసం ఉంటున్నారు. యాసిన్ రియాజ్ భత్కల్‌తో కలిసి ఇండియన్ ముజాహిదీన్‌ను ఏర్పాటు చేశాడు.
రియాజ్ షాబందరి, అబ్దుల్ సుభాన్ ఖురేషి, సాదిక్ ఇశ్రార్ షేక్, టైస్టుగా మారిన గ్యాంగ్‌స్టర్ అమీర్ రెజా ఖాన్‌లు వీరి సహచరులుగా ఉన్నారు. పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ నుంచి దీనికి పూర్తి సహాయ సహకారాలున్నాయి. ఈ నేపథ్యంలో భత్కల్ నుంచి పుణేకు మకాం మార్చిన యాసిన్ ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొన్నాడు. ఐఎం భారతదేశ చీఫ్‌గా పలు పేలుళ్లకు నేతృత్వం వహించాడు. వందల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి, గాయపడటానికి కారకుడయ్యాడు. 2008లో జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలో పేలుళ్ల ద్వారా యాసిన్ భత్కల్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఢిల్లీలో జరిగిన ఐదు వరుస పేలుళ్లలో 30 మంది చనిపోయారు. 2008 మే 13న జైపూర్‌లో, జూలై 25న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో, అదేనెల 26న అహ్మదాబాద్‌లో, సెప్టెంబర్ 13న ఢిల్లీలో పేలుళ్లకు నేతృత్వం వహించాడు.
2010 ఫిబ్రవరి 13న పుణేలో జర్మన్ బేకరీలో పేలుడుకు, 2011 జూలై 13న ముంబైలో వరుస పేలుళ్లకు యాసిన్ ప్రధాన సూత్రధారి. ఈ ఏడాది ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్, గత జూలై 7న బుద్దగయలో చోటుచేసుకున్న వరుస పేలుళ్లకు కూడా యాసిన్ సూత్రధారి. ఈ క్రమంలో కొనసాగిన దర్యాప్తులోనే.. 2004లో కర్ణాటకలో పేలుడు పదార్థాల పంపిణీలో ఇతని పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. 2006లో ముంబైలో జరిగిన వరుస రైలు పేలుళ్లకు కూడా ఇతనే సూత్రధారి అనే అనుమానాలున్నాయి. ఈ పేలుళ్లలో 187 మంది మృత్యువాతపడ్డారు. యాసిన్‌తోపాటు అరెస్టైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన వాడు. ఇతను కూడా కాలాంతకుడు. 2011 జూలై 13న జరిగిన ముంబై సీరియల్ పేలుళ్లలో నేరుగా పాల్గొన్న 26 ఏళ్ల తబ్రేజ్ రిస్క్ ఆపరేషన్‌లు చేయడానికి ఉత్సాహం చూపుతాడనే పేరుంది. హైదరాబాద్ పేలుళ్లలో నేరుగా పాల్గొనడానికి కారణం అదే.
పలుమార్లు తప్పించుకుని: ఐదేళ్లుగా దర్యాప్తు బృందాల కన్నుగప్పి తిరుగుతున్న యాసిన్ అనేకమార్లు దొరికినట్లేదొరికి తప్పించుకున్నాడు. 2009 డిసెం బర్ 29న కోల్‌కతా పోలీసులు దొంగనోట్ల కేసులో బల్లూ మాలిక్ అనే వ్యక్తిని అరెస్టుచేశారు. అతను కోర్టు నుంచి బెయిల్ తీసుకుని పారిపోయిన తరువాత అతనే యాసిన్‌భత్కల్ అని తేలింది. 2011లో చెన్నైలోని ఒక హోటల్లో తనిఖీలు జరుపుతుండగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. రాంచీలో వేరొక పేరుతో పాస్‌పోర్టు కోసం ప్రయత్నించి పోలీసులకు అనుమానం రావడంతో అక్కడనుంచి పరారయ్యాడు.
గత ఏడాది బెంగళూరులో కూడా పోలీసుల నుంచి తప్పించుకున్నట్లు ఉగ్రవాది ఉబెయిద్-ఉర్-రెహ్మాన్ విచారణలో బయటపడింది. స్టూడెంట్ గుర్తింపు కార్డులతో పేలుళ్లకు ముందే మకాం వేయడం, స్వయంగా రెక్కీ నిర్వహించిన తరువాతే పేలుళ్లకు పాల్పడటం యాసిన్‌భత్కల్ స్టైల్. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు కూడా వారం రోజుల ముందుగానే నగరంలో ఆశ్రయం పొందినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడింది. యాసిన్ బాంబు పేలుళ్లకు పాల్పడిన తర్వాత పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు వెళ్లి ఆశ్రయం పొందేవాడ ని నిఘావర్గాల పరిశీలనలో బయటపడింది. ఉగ్రవాదుల గురువు టుండా అరెస్టు తరువాత కీలక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇండో-నేపాల్ సరిహద్దులలో పలువురు ఉగ్రవాద నేతలు అశ్రయం పొందుతున్నట్లు తేలింది.
భత్కల్. ఆధునిక ఉగ్రవాదానికి చిరునామా
Published Fri, Aug 30 2013 3:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
Advertisement
Advertisement