యాసిన్ భత్కల్
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో తమకు సంబంధం ఉందని ఇండియన్ ముజాహుద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. విచారణ అధికారులు యాసిన్ నుంచి పూర్తి వివరాలు రాబట్టారు. బాంబు పేలుళ్ల ఘటనకు పక్షం రోజుల ముందు తుమకూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే బాంబులు తయారు చేసినట్లు భత్కల్ చెప్పినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం బాంబు పేలుళ్ల ఘటనకు మూడు రోజుల ముందు యాసిన్ భత్కల్ తుమకూరు నుంచి బస్సులో బెంగళూరు చేరుకున్నాడు. తరువాత మెజస్టిక్, గాంధీబజార్, కబ్బన్‌పార్క్, చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాలలో తిరిగాడు. 2010 ఏప్రిల్ 17న బెంగ ళూరు రాయల్ చాలెంజర్ - ముంబాయి ఇండియన్స్ జట్ల మధ్య టీ-20 క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని అక్కడే బాంబులు పెట్టాలని యాసిన్ భత్కల్ నిర్ణయించాడు.
ఏప్రిల్ 16న చిన్నస్వామి స్టేడియం దగ్గర యాసిన్ భత్కల్ అనుమానాస్పదంగా కనిపించడంతో పిక్‌పాకెట్ చేసే వ్యక్తిగా భావించిన పోలీసులు రెండు దెబ్బలు వేసి పంపించి వేశారు. ఏప్రిల్ 17 వేకువజామున చిన్నస్వామి స్టేడియం దగ్గర బాంబులు పెట్టారు. మ్యాచ్ ప్రారంభం కాక మునుపే పేలుళ్లు సృష్టించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. అనంతరం గాంధీబజార్, బీవీకే అయ్యంగార్ రోడ్లలో బాంబు పేలుళ్లు సష్టించాలని స్కెచ్ వేసిన యాసిన్ భత్కల్ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నట్లు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.