యాసిన్ భత్కల్ చిక్కాడు
ఇంటెలిజెన్స్ వలలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది
భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన బీహార్ పోలీసులు
దేశవ్యాప్తంగా 40 బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడు
దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల సూత్రధారి, పాత్రధారి ఇతనే
వెంకటాద్రి థియేటర్ ఎదురుగా 107 బస్‌స్టాప్‌లో స్వయంగా బాంబులు పెట్టిన యాసిన్
ఇదే కేసులో మరో నిందితుడు తబ్రేజ్ కూడా అరెస్టు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ/పాట్నా: రాష్ర్ట రాజధాని హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎట్టకేలకు ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కాడు. భారత్-నేపాల్ సరిహద్దుల్లో బీహార్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అగ్రనేత అయిన యాసిన్‌పై రూ.35 లక్షల రివార్డు ఉంది. పలుమార్లు దొరికినట్టే దొరికి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న ఇతని కోసం గత ఐదేళ్లుగా గాలింపు కొనసాగుతోంది. ఇతనితో పాటు దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’ని కూడా బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులకు అప్పగించనున్నారు. బీహార్‌లోని మోతిహరి మేజిస్ట్రేట్ వీరిని మూడురోజుల ట్రాన్సిట్ రిమాండ్‌కు అనుమతించారు.
ఇద్దరు కరుడుగట్టిన ఉగ్రవాదుల అరెస్టును కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ధ్రువీకరించారు. ‘బుధవారం రాత్రి భారత్-నేపాల్ సరిహద్దులో ఉన్న యాసిన్ భత్కల్‌ను ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. ప్రస్తుతం బీహార్ పోలీసుల అదుపులో ఉన్న అతన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు..’ అని షిండే గురువారం పార్లమెంటు వెలుపల విలేకరులకు చెప్పారు. యాసిన్ పట్టుబడిన విషయం జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి తన సంబంధీకులను కలుసుకోవాలని యాసిన్ ప్రయత్నించాడని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
పాట్నాకు 100 కిలోమీటర్ల దూరంలోని భారత్-నేపాల్ సరిహద్దులో తూర్పుచంపారన్ జిల్లా రక్సువల్ సబ్ డివిజన్‌లోని నహర్ చౌక్ సమీపంలో యాసిన్‌ను, తబ్రేజ్‌ను అరెస్టు చేసినట్లు బీహార్ అదనపు డీజీపీ రవీంద్రకుమార్ పాట్నాలో విలేకరులకు చెప్పారు. యాసిన్ మరో పేలుడుకు కుట్ర చేస్తున్నట్టుగా సమాచారం ఉందన్నారు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ మాస్టర్‌మైండ్, బాంబుల నిపుణుడిగా భావించే అబ్దుల్ కరీమ్ తుండా పట్టుబడిన పక్షం రోజులకే యాసిన్ భత్కల్ సైతం చిక్కడం అనేక బాంబు పేలుళ్ల కేసుల దర్యాప్తులో కీలకమలుపు కాగలదని భావిస్తున్నారు. ముప్పై ఏళ్ల యాసిన్ ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ ప్రభుత్వం, ఎన్‌ఐఏలు రూ.10 లక్షల చొప్పున, ముంబయి పోలీసులు రూ.15 లక్షలు రివార్డు ప్రకటించారు.