ప్రధానమంత్రికి వైఎస్ జగన్ లేఖ
► ఐడీఎస్- 2016 జాబితాలోని వివరాలు చంద్రబాబుకు ఎలా తెలిశాయి
► కచ్చితంగా లెక్క చెబుతున్నారంటే ఆ వ్యక్తి ఆయన బినామీ అయి ఉండాలి
► వివరాలు బయటకు చెప్పబోమని సీబీడీటీ స్పష్టం చేసింది
► అధికారికంగా ఎటువంటి జాబితా విడుదల చేయలేదని సీబీడీటీ వివరణ ఇచ్చింది
► ఆ తర్వాత కూడా చంద్రబాబు మాత్రం వివరాలు చెబుతున్నారు
► ఐడీఎస్- 2016 జాబితాను బయపెట్టాలి
► లేఖలో ప్రధానమంత్రిని కోరిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
హైదరాబాద్: ఆదాయ వెల్లడి పథకం -2016పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రధానికి జగన్ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి....
''ఐడీఎస్-2016 జాబితాపై ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ అంశంపై తలొకరు తలోరకంగా మాట్లాడుతున్నారు. ఆస్తులు వెల్లడించిన వారి పేర్లను వ్యాపారవేత్తలు/నగరాలు/రాష్ట్రాలు వారీగా బయటపెట్టవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గట్టిగా చెప్పారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) అక్టోబర్ 3న ట్వీట్ చేసింది. ప్రాంతాలవారీగా ఆదాయ వెల్లడి వివరాలకు సంబంధించి ఎటువంటి అధికారికారిక జాబితా విడుదల చేయలేదని సీబీడీటీ వివరణయిచ్చింది. అధికారిక జాబితా విడుదల చేసినట్టు వచ్చిన వార్తలను నమ్మొద్దని ప్రజలను సీబీడీటీ కోరింది. మరోవైపు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఆ వివరాలు బయటకు చెబుతున్నారు. సీబీడీటీ వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆయన రెండు సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ నుంచి 13 వేల కోట్ల ఆదాయ వివరాలు వెల్లడయ్యాయని, ఒక వ్యక్తి 10 వేల కోట్ల ఆదాయ వివరాలు వెల్లడించారని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయనకు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది. ఒకవేళ ఇది వాస్తవం అయితే.. ఆ వ్యక్తిని చంద్రబాబు బినామీగా ప్రకటించాలి. ఎందుకంటే, చంద్రబాబు అంత కచ్చితంగా ఆ మొత్తం ఎంతో చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మేం కూడా దీని గురించి తెలుసుకుంటున్నాం.
ఎన్‌సీఏఈఆర్ సర్వేలో చంద్రబాబు పాలనలోని ఆంధ్రప్రదేశ్ అత్యంత అవినీతిపరమైన రాష్ట్రంగా మొదటి ర్యాంకు సాధించింది. రెండున్నరేళ్ల కాలంలో రూ. లక్షన్నర కోట్ల కుంభకోణానికి ఎలా పాల్పడ్డారో ఇటీవలే ఓ పుస్తకం ప్రచురించి, దాన్ని కూడా మీకు ఇచ్చాం. విచారణ చేయడానికి తగినంత సమాచారం ఆ పుస్తకంలో ఉంది. మేం ఇచ్చిన విజ్ఞాపనపై ఇంతవరకు ఎలాంటి విచారణ జరగలేదు, ఎలాంటి చర్య తీసుకోలేదు. దేశంలో ఏ ఒక్కరూ కూడా తనపై విచారణ జరిపించలేరని చంద్రబాబు గట్టి నమ్మకంతో ఉన్నారు. నల్లధనంతో ఎమ్మెల్యేలను కొన్నా.. ఓటు కోసం కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయినా.. వేల కోట్లు పోగేసినా నిరభ్యంతరంగా పదవిలో కొనసాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాల ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం ఐడీఎస్-2016 జాబితాను బహిర్గతం చేయాలని కోరుతున్నాం. అలాగే చంద్రబాబు అవినీతిపై విచారణ చేయించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు అవినీతిపై బలమైన ఆధారాలతో రూపొందించిన పుస్తకం మరో ప్రతిని మీకు పంపిస్తున్నాను.''