
నేడు చంద్రగిరికి వైఎస్ జగన్
బంధువుల వివాహ వేడుకకు హాజరు
ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు
తిరుపతి: ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్రెడ్డి బుధవారం చంద్రగిరికి రానున్నారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన చంద్రగిరి చేరుకుంటారు. అక్కడి వైఎస్‌ఎంఆర్ కల్యాణ మండపంలో జరిగే బంధువుల వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులు శుభకర్‌రెడ్డి, నళినీరెడ్డిలను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామి తెలిపారు.
భారీ స్వాగత ఏర్పాట్లు
చాలా రోజుల తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి విచ్చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారి మీదున్న దామినేడు నుంచి చంద్రగిరి వరకూ రోడ్డుకు ఒకవైపున పార్టీ జెండాలు పట్టుకుని 7 వేల మంది అభిమానులు స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. హైవే మీద 20 కిలోమీటర్ల పొడవున భారీ జెండాలను ఏర్పాటు చేశారు. మధ్యమధ్యలో పార్టీ అధినాయకునికి స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు, అధిక సంఖ్యలో కటౌట్లను ఏర్పాటు చేశారు.