రేపు వైఎస్సార్ వర్ధంతి
సాక్షి, చెన్నై : వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం ఘన నివాళులు అర్పించడానికి తమిళనాడు వైఎస్సార్ సీపీ నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. ఉత్తర చెన్నై పరిధిలోని కొరుక్కుపేటలో ఉన్న కామరాజర్ నగర్‌లో సంతాప సభ, అన్నదానం చేయనున్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నా, ఆయన కుటుంబం అన్నా ఇక్కడి తెలుగు వారికి ప్రత్యేక అభిమానం. ఆ కుటుంబానికి తాము సైతం అండగా ఉన్నామని ఇక్కడి అభిమాన లోకం చాటుకుంటోంది. అలాగే, ప్రతి ఏటా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది తెలుగు వారు అత్యధికంగా ఉండే కొరుక్కుపేటలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణరుుంచారు.
ఈ విషయమై తమిళనాడు వైఎస్సార్ సీపీ నేతలు జాకీర్ హుస్సేన్, శరవణన్ ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ, రాజశేఖరరెడ్డి భౌతికంగా అం దర్నీ వీడి ఐదేళ్లు అవుతున్నా, ఆయన జ్ఞాపకాలు ప్రతి హృదయంలో చిరస్మరణీయంగా నిలిచిపోయూయన్నారు. తమ నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రజల కోసం ప్రభుత్వంతో చేస్తున్న పోరాటతీరు వైఎస్‌ను గుర్తుకు తెస్తున్నదన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి తమలాంటి వారెం దరో ఇక్కడ అండగా ఎల్లప్పుడూ ఉన్నారని చెప్పారు. రాజశేఖరరెడ్డి వర్ధంతిని తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే కొరుక్కుపేటలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇందుకుగాను తమకు వైఎస్సార్ అభిమానులు మణివణ్ణన్, ఆవడి భాస్కరన్,
బాలాజీ, స్టాన్లీ జగన్, రత్నం, సురేష్, డేవిడ్, చంద్ర శేఖర్, మహేష్, నెల్సన్ బాబు, ఆనంద్ బాబు, మదు, కొండయ్యలు సంపూర్ణ సహకారం అందించారని వివరించారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని సంతాప సభ నిర్వహించి, అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆరంభమయ్యే ఈ కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, జగనన్న అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పెరంబూరు, అంబత్తూరుతోపాటుగా ఉత్తర చెన్నై పరిధిల్లో పలు ప్రాంతాల్లో వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించే విధంగా, వర్ధంతికి తరలిరావాలని పిలుపునిస్తూ పెద్దఎత్తున పోస్టర్లు అంటించడం విశేషం.