లోకేశ్ కనుసన్నల్లోనే పాలన : అంబటి
రాజమండ్రి : రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రులు ఉన్నా పాలన అంతా నారా లోకేశ్ కనుసన్నల్లోనే జరుగుతోందని, ఆయన రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా నగరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా, ప్రాజెక్టుల్లో అవినీతి ద్వారా లక్షల కోట్లు దండుకుంటున్నారని, దోపిడీ ప్రధాన లక్ష్యంగా పాలన జరగుతోందని అంబటి మండిపడ్డారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను కించపరిచే విధంగా లోకేష్ ప్రవర్తించడం బాధాకరమన్నారు. పదవి చేపట్టిన రోజు నుంచి నేటి వరకూ లోకేష్ నుంచి అవమానాలు ఎదుర్కోవడం చూస్తుంటే మంత్రి రాజప్ప పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఏ అధికారంతో లోకేష్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో పెత్తనం చేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. లోకేష్‌కు దీటుగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో దొరికినంత దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
టీడీపీ అప్రజాస్వామిక విధానాలను వైఎస్సార్ సీపీ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉందని, ప్రత్యేక హోదా కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో దశల వారీగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించేందుకు కూడా సిద్ధమని జగన్ స్పష్టం చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం తమకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జీ పాల్గొన్నారు.