state rule
-
లోకేశ్ కనుసన్నల్లోనే పాలన : అంబటి
-
లోకేశ్ కనుసన్నల్లోనే పాలన : అంబటి
రాజమండ్రి : రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రులు ఉన్నా పాలన అంతా నారా లోకేశ్ కనుసన్నల్లోనే జరుగుతోందని, ఆయన రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా నగరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, ప్రాజెక్టుల్లో అవినీతి ద్వారా లక్షల కోట్లు దండుకుంటున్నారని, దోపిడీ ప్రధాన లక్ష్యంగా పాలన జరగుతోందని అంబటి మండిపడ్డారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను కించపరిచే విధంగా లోకేష్ ప్రవర్తించడం బాధాకరమన్నారు. పదవి చేపట్టిన రోజు నుంచి నేటి వరకూ లోకేష్ నుంచి అవమానాలు ఎదుర్కోవడం చూస్తుంటే మంత్రి రాజప్ప పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఏ అధికారంతో లోకేష్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో పెత్తనం చేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. లోకేష్‌కు దీటుగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో దొరికినంత దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. టీడీపీ అప్రజాస్వామిక విధానాలను వైఎస్సార్ సీపీ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉందని, ప్రత్యేక హోదా కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో దశల వారీగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించేందుకు కూడా సిద్ధమని జగన్ స్పష్టం చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం తమకు కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు వలవల బాబ్జీ పాల్గొన్నారు. -
సీఎం నాలుగు రోజులు... మంత్రులు మూడు రోజులు
సాక్షి, విజయవాడ బ్యూరో: వారంలో నాలుగు రోజులు విజయవాడ నుంచే రాష్ట్ర పరిపాలన నిర్వహించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ నిర్ణయాలకు సర్కారు కట్టుబడి ఉందన్నారు. ఇకపై మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు కూడా వారంలో మూడ్రోజులు విజయవాడలోనే ఉంటారన్నారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అందులోని ఆదాయ, వ్యయాలపై ఆర్థిక రంగ నిపుణులతో సమీక్షించారన్నారు. మూడో విడత రైతు రుణమాఫీ, అందులోని సమస్యలు, పరిష్కారాలపై కూడా అధికారులతో సమీక్షించారని తెలిపారు. -
కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి రాష్ట్ర పాలన
పలాస: కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి రాష్ట్ర పరిపాలనను తెలుగుదేశం ప్రభుత్వం అప్పగించిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యు) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రామకృష్ణ అన్నారు. అందులో భాగమే కార్పొరేట్ దిగ్గజం, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ నేడు మంత్రి అయ్యారని ఆరోపించారు. పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా విద్యా సదస్సు ఆదివారం జరిగింది. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షురాలు డి.మల్లిక అధ్యక్షతన జరిగిన సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ఏజెంటని విమర్శించారు. తొమ్మిదేళ్లు అధికారంలో, మరో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండడంతోపాటు నేడు మళ్లీ అధికారంలోకి వచ్చిన ఆయన ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రోత్సాహం ఇస్తున్నారన్నారని మండిపడ్డారు. డీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు కోత ధర్మారావు మాట్లాడుతూ దేశంలో 25 శాతం మందికి మాత్రమే ప్రభుత్వం ప్రకటించినట్టు 2,400 కేలరీల శక్తి భోజనం లభిస్తోందన్నారు. చాలామంది అత్యంత దారిద్య్రరేఖకు దిగువున జీవిస్తూ విద్య, వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్నారన్నారు. పలాస ప్రభుత్వ జూనియన్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రాజగోపాలరావు మాట్లాడుతూ ఉద్యమాలు చట్ట పరిధిలో ఉండాలని, అందుకు నాయకత్వం కూడా అవసరమని చెప్పారు. అలాంటి ఉద్యమ సంస్థయే పీడీఎస్‌యూ అని విద్యార్థులంతా తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి శాంతియుతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. డి.మల్లిక మాట్లాడుతూ చాలీచాలని మెస్ చార్జీలతో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించుకోవడాని కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీడీఎస్యు అంటే ధర్నాలు, ఆందోళనలే కాదని, సామాజిక స్పృహ కలిగి మంచి యువతీ, యువకులుగా తయారు కావాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు ఎస్.పెంటయ్య, రమేష్, వంకల మాధవరావు, గోపిప్రవీణ్ పాల్గొన్నారు. సదస్సు అనంతరం విద్యార్థులంతా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు.