వారంలో నాలుగు రోజులు విజయవాడ నుంచే రాష్ట్ర పరిపాలన నిర్వహించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు.
సాక్షి, విజయవాడ బ్యూరో: వారంలో నాలుగు రోజులు విజయవాడ నుంచే రాష్ట్ర పరిపాలన నిర్వహించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ రాష్ట్ర స్థాయి ప్రభుత్వ నిర్ణయాలకు సర్కారు కట్టుబడి ఉందన్నారు.
ఇకపై మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు కూడా వారంలో మూడ్రోజులు విజయవాడలోనే ఉంటారన్నారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అందులోని ఆదాయ, వ్యయాలపై ఆర్థిక రంగ నిపుణులతో సమీక్షించారన్నారు. మూడో విడత రైతు రుణమాఫీ, అందులోని సమస్యలు, పరిష్కారాలపై కూడా అధికారులతో సమీక్షించారని తెలిపారు.