స్టోర్ రూమ్‌లో అగ్ని ప్రమాద దృశ్యం(ఫైల్)
తూనికలు కొలతల శాఖ జిల్లా కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన జరిగిన అగ్ని ప్రమాద సంఘటన కేసులో జిల్లా అధికారితో పాటు మరో నలుగురిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తూకాల్లో మోసం చేస్తున్నారన్న ఆరోపణలపై హుజూర్‌నగర్‌లోని పెట్రోల్‌బంక్‌పై అధికారులు దాడులు నిర్వహించి సేకరించిన సాక్ష్యాలను తారుమారు చేయడానికే ఆఫీస్‌కు నిప్పు పెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. వారిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట తూనికల కొలతల కార్యాలయంలో ఈనెల 5 వతేదీ అర్ధరాత్రి కావాలని అగ్ని ప్రమాదం చేసిన సృష్టికర్తను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్‌లో గత నెల 28న ఒక పెట్రోల్ బంకులో తూకంలో మోసం జరుగుతుందని రాష్ట్ర కార్యాలయానికి సమాచారం రావడంతో వారి ఆదేశాల మేరకు యాదాద్రి, సూర్యాపేట జిల్లా తూనికల కొలతల అధికారులు సంయుక్తంగా పెట్రోల్ బంకును తనిఖీ చేసి అనుమానం రావడంతో మిషన్‌లో ఉన్న డిజిటల్ పల్సర్ చిప్‌ను సీజ్ చేశారు. దాన్ని ఒక ఐరన్ బాక్సులో ఉంచి సూర్యాపేట కార్యాలయంలోని స్టోరు రూమ్‌లో అదే రాత్రి ఉంచారు. ఈనెల 5వతేదీన సోర్‌రూములో షార్టు సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగిందని నమ్మించి సాక్ష్యాన్ని తారుమారు చేయాలని చేసిన ప్రయత్నంలో వారు మంట పెట్టడానికి కిరోసిన్ వాడడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
మలిదశకు విచారణ
రంగంలోకి దిగిన పోలీసులు గత 23 రోజులుగా విచారణ చేస్తూ గత రాత్రి మహబూబ్‌నగర్, జెర్రిపోతులగుడెం, మిర్యాలగూడెం, నడిగుడెంలకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కీలక వ్యక్తిగా ఈ అగ్ని ప్రమాదానికి సృష్టికర్తగా జిల్లా తూనికల కొలతల సిబ్బందే అని పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. గురువారం పోలీసులు సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నారు. అతడు తన ఫోన్ నుంచి పెట్రోల్ బంకు యజమానితో చాలా సార్లు సంభాషణలు సాగించినట్లు, సాక్ష్యం తారుమారుకోసం రూ.8లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీరిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.
డూప్లికేట్ తాళం...
తూనికల కొలతల శాఖ అధికారి స్టోర్ రూమ్ తాళాన్ని డూప్లికేట్ తయారు చేయించి పెట్రోల్ బంకు యజామాన్యానికి అందించి సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి వారితో కలిశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న సదరు పెట్రోల్ బంకులను సీజ్ చేయాల్సిన అధికారులు వారితోనే కుమ్మక్మై సాక్ష్యాలను తారుమారు చేసి డబ్బులకు అమ్ముడుపోతున్న ఘటనను వినియోగదారులు జీర్జించుకోలేకపోతున్నారు. ఈ కేసులో ఎవరున్నా పోలీసులు సరైన విచారణ చేసి వారిని శిక్షించాలని కోరుతున్నారు.
పెట్రోల్ బంకు సీజ్ అవుతుందని..
పల్సర్ చిప్ బాక్సును తారుమారు చేసి మోసాలకు పాల్పడుతుండడంతో సీజ్ చేసిన దాంట్లో విషయం నిరూపితమవుతుందని భావించిన పెట్రోల్‌బంకు యాజమాన్యం సూర్యాపేట జిల్లా తూనికల కొలతల అధికారితో కుమ్మక్మై సాక్ష్యాలు తారుమారు చేయాలని అనుకున్నాడు. తూకంలో తేడాలు నిరూపితమైతే బంకు సీజ్‌తో పాటు కేసులు అయ్యే అవకాశముండడంతో దాదాపు రూ. 8 లక్షల మేర డీల్ కుదుర్చుకొని ఈ సాహసానికి పూనుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment