weights and measures department
-
తూకాల్లో మోసాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: వ్యాపార దుకాణాలు, సూపర్ మార్కెట్లు, బంగారు ఆభరణాల విక్రయాల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. తూనికలు, కొలతల చట్టాన్ని గ్రామస్థాయి నుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. వినియోగదారుల హక్కులను సంపూర్ణంగా పరిరక్షించడంలో గ్రామ, వార్డు సచివాలయ (జీఎస్‌డబ్ల్యూఎస్) సిబ్బందిని భాగస్వాములను చేయనుంది. దుకాణాల్లో సంప్రదాయ, ఎలక్ట్రానిక్ కాటా యంత్రాలను నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించడం, స్టాంపింగ్ ప్రక్రియలను పర్యవేక్షించేలా బాధ్యతలను వికేంద్రీకరించింది. ఇప్పటికే జీఎస్డబ్ల్యూఎస్లో సాంకేతిక అర్హత కలిగిన ఇంజినీరింగ్ సహాయక సిబ్బందిని గుర్తించింది. వీరికి వచ్చే వారంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నారు. సిబ్బంది కొరతను అధిగవిుంచేలా.. వాస్తవానికి తూనికలు, కొలతల శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. తూకంలో మోసాలతో పాటు ప్యాకింగ్ ఉత్పత్తులపై ముద్రిత ధర కంటే ఎక్కువకు విక్రయించడం, ఎమ్మార్పీలు ముద్రించకపోవడం వంటి లోపాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పరిపాలన వికేంద్రీకరణలో కీలక భూమిక పోషిస్తున్న సచివాలయ వ్యవస్థను సమర్థంగా వినియోగించుకునేలా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే భౌతికశాస్త్రం చదివిన బీఈ, బీటెక్, బీఎస్సీ విద్యార్హత కలిగిన ఇంజినీరింగ్ సహాయకులను ఎంపిక చేసింది. తూనికలు, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణలో సచివాలయ ఇంజినీరింగ్ సహాయక సిబ్బంది స్థానికంగా వ్యాపార దుకాణాల్లో తనిఖీలు చేసి లోపాలు గుర్తించాలి. తూకాల్లో తేడా, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించడం, గ్యాస్, పెట్రోల్ బంకుల్లో మోసాలు వంటి అంశాలపై ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా విధులను కేటాయిస్తూ పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీ హెచ్.అరుణ్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు గ్రామ, మండల స్థాయిలో ఎప్పటికప్పుడు వినియోగదారులకు అవగాహన కల్పించడంతోపాటు 1967 టోల్‌ఫ్రీ నంబరుపై చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మార్కెట్లో వస్తువులు కొంటున్నారా? వీటిని గమనించకపోతే జేబుకి చిల్లే!
సాక్షి,విజయనగరం పూల్‌బాగ్: ఏ వస్తువు కొనుగోలు చేయాలనుకున్నా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. దుకాణాల్లో లభ్యమయ్యే ఘన పదార్థాలను తూకాల్లో, ద్రవ పదార్థాలను కొలతల్లో కొలుస్తారు. వీటికి నిర్దిష్ట ప్రమాణాలుంటాయి. అయితే కొందరు వ్యాపారులు అధిక ధన దాహంతో కొలతల్లో జిమ్మిక్కులు చేస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొలతల్లో ఏ చిన్నపాటి తేడా గమనించినా వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయాలి. లేకపోతే అమ్మకందారుల మోసానికి గురికావాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొనుగోలుదారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న విషయంపై తూనికలు, కొలతల శాఖ అధికారులు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే దుకాణాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం చేస్తూ అమ్మకందారుల మోసాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13,254 సాధారణ, ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నాయి. వాటిని రిపేరు చేసేందుకు 9 మంది లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు. సాధారణ కాటాలు రెండేళ్లకొకసారి, ఎలక్ట్రానిక్ కాటాలను ఏడాదికొకసారి ముద్రలు/సీళ్లు వేయించుకోవాలి. అవి ఏమైనా మరమ్మతులకు గురైతే లైసెన్స్ హోల్డర్స్ వద్ద రిపేర్ చేయించుకోవాలి. ఎంఆర్పీ కన్నా ఎక్కువకు అమ్మితే చర్యలు.. జిల్లాలోని చౌకధరల దుకాణాలు, వే బ్రిడ్జిలు, రైస్ మిల్లులు, రైస్ షాపులు, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ షాపులు, డిస్పెన్సరీ యూనిట్లు, వాటర్ ప్లాంట్లు, పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం దుకాణాలు, స్వీట్స్, బేకరీ, కిరాణా షాపులు, జనరల్ స్టోర్స్, పాలు, పాల ఉత్పత్తులు, పరిశ్రమలు, మాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లలో ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా అమ్మకాలు చేపట్టకూడదు. ఎలక్ట్రానిక్ కాటాలు జీరోలో ఉండాలి. మాంసం, చేపల దుకాణాల్లో కాటాలు వేలాడదీసి ఉండాలి. తూకం వేసేటప్పుడు కొనుగోలుదారులు సరిపోయిందా లేదా అనే విషయం గమనించాలి. ఒకవేళ తూకం తక్కువగా ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయాలి. దీనికోసం ఫోన్ నంబర్లు 08922–223845, 9398159434, 90000828467ను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. చదవండి: Writer Padmabhushan: ‘ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు’ -
ఎక్కడికెళ్లినా మోసమే..
సాక్షి, విజయనగరం : వినియోగదారులు నిత్యం నిలువ దోపిడీకి గురవుతున్నారు. చిన్న కూరగాయల కొట్టు మొదలుకుని బంగారుషాపు వరకు ఎక్కడికెళ్లినా వినియోగదారుడిని మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. చివరకు రేషన్ డీలర్లు సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో దుకాణాల్లో వేసిన తూకం.. ఇంటికెళ్లి చూస్తే తేడా కనిపిస్తోంది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన తూనికలు కొలతలు శాఖ సిబ్బంది కొరత పేరుతో చోద్యం చూస్తోంది. కిరాణ, వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ, హార్డ్‌వేర్, బంగారు షాపులు ఇలా వివిధ రకాల దుకాణాలు జిల్లాలో 24,301 ఉన్నాయి. చిరువ్యాపారులను కలుపుకుంటే 50 వేల మందికిపైగా ఉంటారు. అయితే జిల్లా వ్యాప్తంగా తూకానికి సంబంధించి ఏ ఏడాది కూడా 300కు మించి కేసులు నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తే తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా తనిఖీలు నిర్వహించేటప్పుడు కిరాణాదుకాణాలు, షాపుల యజమానుల నుంచి రూ. 1200 నుంచి రెండు వేల రూపాయల వరకు వసూలు చేసి రూ. 200కే రశీదు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే మరింత ఇబ్బందులకు గురి చేస్తారని దుకాణదారులు వాపోతున్నారు. కాటాలకు సీళ్లు వేసేందుకు కూడా అక్కడి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా థియేటర్లలో ఎక్కడ కూడా కూల్ డ్రింక్స్,తిను బండారాలపై ఎంఆర్పీ వసూలు చేస్తున్న దాఖలాలు లేవు. అధిక ధరలకు విక్రయిస్తుండడంపై ఫిర్యాదులు అందుతున్నా చర్యలు తీసుకోకపోవడం విశేషం. నిర్ధిష్ట ప్రమాణాలుంటాయి... ఘన పదార్థాలైతే తూకాలు, ద్రవ పదార్థాలైతే కొలతల్లో కొలుస్తారు. వీటికి నిర్థిష్ట ప్రమాణాలుంటాయి. అయితే కొందరు వ్యాపారులు ధన దాహంతో జిమ్మిక్కులు చేస్తున్నారు. వినియోగదారునికి తెలియకుండానే మోసం చేస్తున్నారు. తూనికలు– కొలతలు శాఖ నిబంధనల ప్రకారం.. వ్యాపారి ప్రతి రెండేళ్లకు ఒకసారి తప్పనిసరిగా తూకం రాళ్లు, ప్రతి ఏటా కాటాకు ప్రభుత్వ పరమైన ముద్రలు వేయించుకోవాలి. కాటాలో తేడాలు వస్తే సరి చేయించుకోవాలి. అలా చాలా మంది వ్యాపారులు చేయించుకోవడం లేదు. తూనికలు కొలతలు శాఖ కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో వ్యాపారులు అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కూరగాయల వ్యాపారమే ఎక్కువ.. జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో కూరగాయల వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. తూకం కాటాలతో మోసం చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ కాటాలతో తూకం వేస్తున్నా అందులో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ముందుగానే వంద గ్రాముల తగ్గించి జీరో వచ్చేలా అమర్చుతున్నారు. కొన్ని దుకాణాల్లో కాటాపై ఉన్న పళ్లెం బరువును లెక్కించకుండా తూకంలో కలిపేసి మోసాలకు పాల్పడుతున్నారు. కిలోకు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. గ్యాస్‌లోనూ చేతివాటం వంటగ్యాస్ సిలిండర్ తూకంలోను వ్యత్యాసం ఉంటోందని వినియోగదారులు వాపోతున్నారు. సిలిండర్లను తూకం వేయకుండానే అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలలకు రావాల్సిన సిలిండర్ కేవలం 40 రోజులకే అయిపోతుందని గృహిణులు గగ్గోలు పెడుతున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఏసీబీకి చిక్కిన మెట్రాలజీ అధికారి
ఖమ్మంక్రైం: లంచాలకు అలవాటు పడి వ్యాపారులను పీక్కుతింటున్న ఓ అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా శనివారం పట్టుకున్నారు. జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి (తూనికలు కొలతలశాఖ)ఓ దళారి ద్వారా లంచం తీసుకొంటూ పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ క్రాస్‌రోడ్‌లో ఎస్ఎస్ వేబ్రిడ్జి నడుపుతున్న సిద్ధారెడ్డికి ఆగస్టు 8వ తేదీతో రెన్యువల్ అయిపోయింది. రెన్యువల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొన్న సిద్ధారెడ్డి దాని ఆమోదానికి అప్పటి నుంచి జిల్లా తూనికల కొలతలశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి గూడూరు అశోక్ బాబును పలుమార్లు కలిసాడు. వైరా రోడ్‌కు చెందిన ఎలక్ట్రానిక్ కాంటాలు, వే బ్రిడ్జిలు బాగు చేసే ప్రైవేట్ మెకానిక్ వచ్చి మీ పని కావాలంటే రూ.10 వేలు లంచం కావాలని తనను అశోక్‌బాబు పంపించారని చెప్పాడు. దీంతో సిద్ధారెడ్డి అంత లంచం ఎలా తీసుకొంటారని ట్రంక్ రోడ్లో ఉన్న లీగల్ మెట్రాలజీ కార్యాలయానికి వెళ్లి అశోక్‌బాబును కలిసాడు. శ్రీకాంత్ చెప్పింది చేస్తేనే మీదరఖాస్తు ఆమోదిస్తామని చెప్పగా సిద్ధారెడ్డి అంత లంచం ఇచ్చుకోలేనని అనడంతో దర ఖాస్తును పెండింగ్‌లో పెట్టారు. దీంతో సిద్ధారెడ్డి విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం సిద్ధారెడ్డి శనివారం జిల్లా అధికారి అశోక్‌బాబుకు ఫోన్ చేసి శ్రీకాంత్‌ను పంపించండి డబ్బులు ఇస్తానని చెప్పాడు. దీంతో శ్రీకాంత్ శనివారం సాయంత్రం వరంగల్ క్రాస్‌రోడ్‌లో ఉన్న వేబ్రిడ్జి వద్దకు వచ్చాడు. సిద్ధారెడ్డి రూ.13 వేలు ఇవ్వడంతో మాటు వేసిన ఏసీబీ బృందం శ్రీకాంత్‌ను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొన్నారు. డబ్బును స్వాధీనపర్చుకొని జిల్లా లీగల్ మెట్రాలజీ కార్యాలయానికి తీసుకొచ్చారు. లంచం తీసుకొకున్న దళారీ శ్రీకాంత్ తనకు ఏ తప్పూ తెలియదని తాను ఆత్మహత్య చేసుకొటానని కావాలనే తనను ఏసీబీ అధికారులు ఇరికించారని కొద్దిసేపు హైడ్రామా సృష్టించాడు. దీంతో లీగల్ మెట్రాలజీ అధికారి అశోక్‌బాబు కూడా తనకూ ఏమీ తెలియదని.. తనకు, శ్రీకాంత్‌కు ఎటువంటి సంబంధంలేదని తాను కూడా ఆత్మహత్య చేసుకొంటానని డ్రామా ఆడాడు. లంచం తీసుకొన్న అధికారి అశోక్‌బాబు, దళారీ శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమణమూర్తి, ప్రవీణ్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటి దొంగే సూత్రధారి?
తూనికలు కొలతల శాఖ జిల్లా కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన జరిగిన అగ్ని ప్రమాద సంఘటన కేసులో జిల్లా అధికారితో పాటు మరో నలుగురిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తూకాల్లో మోసం చేస్తున్నారన్న ఆరోపణలపై హుజూర్‌నగర్‌లోని పెట్రోల్‌బంక్‌పై అధికారులు దాడులు నిర్వహించి సేకరించిన సాక్ష్యాలను తారుమారు చేయడానికే ఆఫీస్‌కు నిప్పు పెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. వారిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట తూనికల కొలతల కార్యాలయంలో ఈనెల 5 వతేదీ అర్ధరాత్రి కావాలని అగ్ని ప్రమాదం చేసిన సృష్టికర్తను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్‌లో గత నెల 28న ఒక పెట్రోల్ బంకులో తూకంలో మోసం జరుగుతుందని రాష్ట్ర కార్యాలయానికి సమాచారం రావడంతో వారి ఆదేశాల మేరకు యాదాద్రి, సూర్యాపేట జిల్లా తూనికల కొలతల అధికారులు సంయుక్తంగా పెట్రోల్ బంకును తనిఖీ చేసి అనుమానం రావడంతో మిషన్‌లో ఉన్న డిజిటల్ పల్సర్ చిప్‌ను సీజ్ చేశారు. దాన్ని ఒక ఐరన్ బాక్సులో ఉంచి సూర్యాపేట కార్యాలయంలోని స్టోరు రూమ్‌లో అదే రాత్రి ఉంచారు. ఈనెల 5వతేదీన సోర్రూములో షార్టు సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగిందని నమ్మించి సాక్ష్యాన్ని తారుమారు చేయాలని చేసిన ప్రయత్నంలో వారు మంట పెట్టడానికి కిరోసిన్ వాడడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మలిదశకు విచారణ రంగంలోకి దిగిన పోలీసులు గత 23 రోజులుగా విచారణ చేస్తూ గత రాత్రి మహబూబ్‌నగర్, జెర్రిపోతులగుడెం, మిర్యాలగూడెం, నడిగుడెంలకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కీలక వ్యక్తిగా ఈ అగ్ని ప్రమాదానికి సృష్టికర్తగా జిల్లా తూనికల కొలతల సిబ్బందే అని పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. గురువారం పోలీసులు సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నారు. అతడు తన ఫోన్ నుంచి పెట్రోల్ బంకు యజమానితో చాలా సార్లు సంభాషణలు సాగించినట్లు, సాక్ష్యం తారుమారుకోసం రూ.8లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీరిని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. డూప్లికేట్ తాళం... తూనికల కొలతల శాఖ అధికారి స్టోర్ రూమ్ తాళాన్ని డూప్లికేట్ తయారు చేయించి పెట్రోల్ బంకు యజామాన్యానికి అందించి సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి వారితో కలిశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న సదరు పెట్రోల్ బంకులను సీజ్ చేయాల్సిన అధికారులు వారితోనే కుమ్మక్మై సాక్ష్యాలను తారుమారు చేసి డబ్బులకు అమ్ముడుపోతున్న ఘటనను వినియోగదారులు జీర్జించుకోలేకపోతున్నారు. ఈ కేసులో ఎవరున్నా పోలీసులు సరైన విచారణ చేసి వారిని శిక్షించాలని కోరుతున్నారు. పెట్రోల్ బంకు సీజ్ అవుతుందని.. పల్సర్ చిప్ బాక్సును తారుమారు చేసి మోసాలకు పాల్పడుతుండడంతో సీజ్ చేసిన దాంట్లో విషయం నిరూపితమవుతుందని భావించిన పెట్రోల్‌బంకు యాజమాన్యం సూర్యాపేట జిల్లా తూనికల కొలతల అధికారితో కుమ్మక్మై సాక్ష్యాలు తారుమారు చేయాలని అనుకున్నాడు. తూకంలో తేడాలు నిరూపితమైతే బంకు సీజ్‌తో పాటు కేసులు అయ్యే అవకాశముండడంతో దాదాపు రూ. 8 లక్షల మేర డీల్ కుదుర్చుకొని ఈ సాహసానికి పూనుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
కొత్తపేట మార్కెట్లో దాడులు
హైదరాబాద్. కొత్తపేట చేపల మార్కెట్లో తూనికలు-కొలతలు, పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. తూనికలు కొలతలు శాఖ అధికారి కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దుకాణాలపై దాడులు చేసి ప్రభుత్వ ముద్రలు లేని తక్కెడలు, బాట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా షాపుల వారికి జరిమానాలు విధించారు. అయితే జరిమానా ఎంత అనేది అధికారులు ఇంకా వెల్లడించలేదు. -
‘తూనికలు, కొలతలు’ ఏవి? l
జిల్లా మొత్తానికి నలుగురే సిబ్బంది వినియోగదారులను దోచుకుంటున్న వ్యాపారులు అరకొర దాడులతో సరిపెడుతున్న అధికారులు ఖమ్మం క్రైం: ‘నగరానికి చెందిన రాజేష్ సెంటర్‌కు వచ్చి కేజీ ద్రాక్ష పండ్లు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి చూశాక పొట్లంలో చాలా తక్కువగా ద్రాక్ష పండ్లు ఉన్నాయి. అనుమానంతో తన ఇంటి వద్ద ఉన్న దుకాణంలో కాంటా వేసి చూడగా అవి అరకేజీ ఉన్నాయి. ఖంగుతిన్న రాజేష్ వ్యాపారి దగ్గరికి వెళ్లి అడిగాడు. వ్యాపారి రాజేష్‌నే దబాయించాడు’. సుబ్బారావు తన ద్విచక్రవాహనంలో పెట్రోల్ పోసుకునేందుకు ఓ బంక్‌కు వెళ్లాడు. రూ.100 పెట్రోల్ పోసుకుని బయటకు పనిమీద వెళ్లి వెంటనే తిరిగి వచ్చాడు. అదే రోజు సాయంత్రం బయటకు వెళ్లగా దారిలో పెట్రోల్ అయిపోయింది. ఉదయం రూ.100 పెట్రోల్ కొట్టించా, అంతలోనే అయిపోయిందేంటని ఆరాతీయగా అది పెట్రోల్ బంక్‌లో జరిగిన మోసం అని అర్థం అయింది’. ఇది రాజేష్, సుబ్బారావు సమస్య లాంటి వారి సమస్య కాదు. ప్రతి వినియోగదారుడు ఎక్కడో ఓ చోట మోసపోతూనే ఉన్నాడు. ఇలాంటి మోసాలను అరికట్టాల్సిన బాధ్యత తూనికలు, కొలతలశాఖది. అయితే, జిల్లాలో ప్రస్తుతం ఆ శాఖ.. కాంటాల్లోని రాళ్ల వలె తుప్పుపట్టి పోయిందనే విమర్శలు వినబడుతున్నాయి. దాడులు ఏవీ? తూనికలు, కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ) సిబ్బంది ప్రతి వారం అన్ని దుకాణాల్లో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సిబ్బంది నెలల తరబడి దాడులు చేయకపోవటంతో వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా తూకాల్లో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను దారుణంగా దోపిడీకి గురిచేస్తున్నారు. కాంటాల్లో తుప్పుపట్టిన రాళ్లను వేస్తూ, కాంటా రాయిలకు బదులు రోడ్లపై దొరికే రాళ్లను వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తోపుడు బండ్ల వ్యాపారుల దగ్గర నుంచి పెద్దపెద్ద దుకాణాల వ్యాపారుల వరకు తమకు తోచిన రీతిలో దోచుకుంటున్నారు. జిల్లా మొత్తానికి నలుగురే సిబ్బంది.... నగరంలోని త్రీటౌన్ పరిధిలోని ట్రంక్‌రోడ్‌లో ఉన్న జిల్లా తూనికలు, కొలతల శాఖలో జిల్లా తూనికల శాఖా అధికారితోపాటు ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు, ఒక అటెండర్ ఉన్నారు. వారంతా జిల్లా మొత్తం తిరగాల్సిందే. ఒక్క ఖమ్మం నగరంలోనే ఎన్నో దుకాణాలుండగా వాటిపైనే సరైన నియంత్రణ లేదు. కాగా, జిల్లా మొత్తం ఉన్న దుకాణాలపై ఈ నలుగురు సిబ్బందే దాడులు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు పలు దుకాణాల నుంచి నెలానెలా మామూళ్లు సిబ్బందికి భారీగానే ముడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది కొరత ఉంది... జిల్లా రెండుగా విడిపోక ముందు ఈ నలుగురు సిబ్బందికి తోడు మరో ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లు ఉండేవారు. నూతనంగా భద్రాది జిల్లా ఏర్పడిన తర్వాత వారిద్దరు అక్కడకు వెళ్లిపోయారు. ఉన్న సిబ్బందితోనే దుకాణాలను తనిఖీ చేస్తున్నాం. నలుగురే సిబ్బంది ఉండటంతో ఇబ్బంది ఏర్పడుతోంది. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. బిట్ల రవీందర్, జిల్లా తూనికలు, కొలతల అధికారి -
ఇం..ధన దోపిడీ
- జిల్లాలో పలుచోట్ల బంకుల మాయాజాలం - లీటర్‌కు 30 నుంచి 100 ఎంఎల్ వరకు పెట్రోల్, డీజిల్ కోత - ఏటా రూ.లక్షల్లో వెనకేస్తున్న కొందరు యజమానులు - 100రోజుల తనిఖీ డ్రైవ్‌లో నిర్థారించిన తూ.కో.శాఖ - రేపటితో ముగియనున్న ప్రత్యేక బృందాల తనిఖీలు సాక్షి,విశాఖపట్నం: బండిలో లీటర్ పెట్రోల్ పోయించుకుంటే ట్యాంక్‌లో పడేది నిజంగా లీటరే అనుకుంటున్నారా కానే కాదు.. వినియోగదారులకు తెలియకుండా అనేక బంకులు చిల్లరచిల్లరగా దోచేస్తున్నాయి. పేరుకు పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నా డబ్బుకు తగిన ఇంధనం అందడం లేదు. ఇది తెలియక వాహనదారులు నిలువునా మోసపోతున్నారు. తూనికలు కొలతల శాఖ పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల ఇటువంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టించుకునే నాథుడు లేకపోవడం, పెట్రోల్‌పంపుల్లో మాయ చేసినా వినియోగదారులు పసిగట్టలేకపోవడంతో బంకుల మాయాజాలానికి అంతులేకుండా పోతోంది. జిల్లావ్యాప్తంగా తూనికలు కొలతలశాఖ 100రోజుల తనిఖీల ప్రక్రియలో భాగంగా అనేక మాయలు బయటకు వస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి జిల్లాలో సుమారు 257 బంకులుండగా వాటన్నింటిలోనూ తనిఖీలు చేపట్టాలని ఇదివరకే నిర్ణయించారు. అందులోభాగంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలోని 185 బంకులపై దృష్టి సారించారు. ఇప్పటికే సుమారుగా 90రోజులు దాటిపోయిన ఈ తనిఖీల్లో అనేక అవకతవకలను అధికారులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల పరిధిలోని అనేక బంకుల్లో కొట్టాల్సిన పెట్రోలు, డీజిల్ కంటే యజమానులు తక్కువ పరిణామంలో ట్యాంకు నింపుతున్నట్లు నిర్దారణకు వచ్చారు. ముఖ్యంగా లీటర్‌కు 30 ఎంఎల్ నుంచి వంద ఎంఎల్ వరకు మిగుల్చుకుంటున్నట్లు గుర్తించారు. ఈవిధంగా భారీ వాహనాలకు పోసే డీజిల్,పెట్రోల్‌లో మరింత ఎక్కువ దోపిడి జరుగుతుందని పసిగట్టారు. ఇంధన దోపిడి వలన ఏటా రూ.లక్షల్లో కొందరు యజమానులు గడిస్తున్నట్లు అధికారులే అనధికారికంగా వెల్లడిస్తున్నారు. ప్రధానంగా గ్రామస్థాయిలో, మండలస్థాయిలో బంకులపై తూనికలుకొలతలశాఖ పరంగా సరైన పర్యవేక్షణ చేపట్టడానికి వీలులేకపోవడం కూడా ఇటువంటి దోపిడికి కొంత అవకాశం ఉంటోందని అధికారులే అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం తనిఖీల్లో భాగంగా వెల్లడైన మోసాలకు సంబంధించి ఆయా బంకుల వివరాలు నమోదు చేస్తున్నారు. బంకుల్లో బహిరంగంగా శాంపిళ్లను ప్రదర్శించాల్సి ఉండగా అదేం జరగడం లేదని తేల్చారు. రకరకాల ఉల్లంఘనలు యథేచ్చగా జరుగుతున్నట్లు గుర్తించి ఇప్పటికే కొందరికి హెచ్చరికలు జారీచేశారు. వినియోగదారులకు కచ్చితంగా కొలత ప్రకారం ఇంధనం పోయాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో బంకులపై తనిఖీల్లో భాగంగా అధికారులు ఏడింటిపై కేసులు నమోదు చేసి, 26 పంపులు సీజ్‌చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు విసృ్తతస్థాయిలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఈనెల 16తో ఇవి ముగియనున్నాయి.