ఇం..ధన దోపిడీ | The magic of places in the district petrol bank | Sakshi
Sakshi News home page

ఇం..ధన దోపిడీ

Published Mon, Sep 15 2014 2:26 AM | Last Updated on Fri, Sep 28 2018 3:27 PM

ఇం..ధన దోపిడీ - Sakshi

ఇం..ధన దోపిడీ

- జిల్లాలో పలుచోట్ల బంకుల మాయాజాలం
- లీటర్‌కు 30 నుంచి 100 ఎంఎల్ వరకు పెట్రోల్, డీజిల్ కోత
- ఏటా రూ.లక్షల్లో వెనకేస్తున్న కొందరు యజమానులు
- 100రోజుల తనిఖీ డ్రైవ్‌లో నిర్థారించిన తూ.కో.శాఖ
- రేపటితో ముగియనున్న  ప్రత్యేక బృందాల తనిఖీలు  
సాక్షి,విశాఖపట్నం:
బండిలో లీటర్ పెట్రోల్ పోయించుకుంటే ట్యాంక్‌లో పడేది నిజంగా లీటరే అనుకుంటున్నారా కానే కాదు.. వినియోగదారులకు తెలియకుండా అనేక బంకులు చిల్లరచిల్లరగా దోచేస్తున్నాయి. పేరుకు పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నా డబ్బుకు తగిన ఇంధనం అందడం లేదు. ఇది తెలియక వాహనదారులు నిలువునా మోసపోతున్నారు. తూనికలు కొలతల శాఖ పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల ఇటువంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టించుకునే నాథుడు లేకపోవడం, పెట్రోల్‌పంపుల్లో మాయ చేసినా వినియోగదారులు పసిగట్టలేకపోవడంతో బంకుల మాయాజాలానికి అంతులేకుండా పోతోంది.  

జిల్లావ్యాప్తంగా తూనికలు కొలతలశాఖ 100రోజుల తనిఖీల ప్రక్రియలో భాగంగా అనేక మాయలు బయటకు వస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి జిల్లాలో  సుమారు 257 బంకులుండగా వాటన్నింటిలోనూ తనిఖీలు చేపట్టాలని ఇదివరకే  నిర్ణయించారు. అందులోభాగంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలోని 185 బంకులపై దృష్టి సారించారు. ఇప్పటికే సుమారుగా 90రోజులు దాటిపోయిన ఈ తనిఖీల్లో అనేక అవకతవకలను అధికారులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల పరిధిలోని అనేక బంకుల్లో కొట్టాల్సిన పెట్రోలు, డీజిల్ కంటే యజమానులు తక్కువ పరిణామంలో ట్యాంకు నింపుతున్నట్లు నిర్దారణకు వచ్చారు.

ముఖ్యంగా లీటర్‌కు 30 ఎంఎల్ నుంచి వంద ఎంఎల్ వరకు మిగుల్చుకుంటున్నట్లు గుర్తించారు. ఈవిధంగా భారీ వాహనాలకు పోసే డీజిల్,పెట్రోల్‌లో మరింత ఎక్కువ దోపిడి జరుగుతుందని పసిగట్టారు.  ఇంధన దోపిడి వలన ఏటా రూ.లక్షల్లో కొందరు యజమానులు గడిస్తున్నట్లు అధికారులే అనధికారికంగా వెల్లడిస్తున్నారు. ప్రధానంగా  గ్రామస్థాయిలో, మండలస్థాయిలో బంకులపై తూనికలుకొలతలశాఖ పరంగా సరైన పర్యవేక్షణ చేపట్టడానికి వీలులేకపోవడం కూడా ఇటువంటి దోపిడికి కొంత అవకాశం ఉంటోందని అధికారులే అంగీకరిస్తున్నారు.

ప్రస్తుతం తనిఖీల్లో భాగంగా వెల్లడైన మోసాలకు సంబంధించి ఆయా బంకుల వివరాలు నమోదు చేస్తున్నారు. బంకుల్లో బహిరంగంగా శాంపిళ్లను ప్రదర్శించాల్సి ఉండగా అదేం జరగడం లేదని తేల్చారు. రకరకాల ఉల్లంఘనలు యథేచ్చగా జరుగుతున్నట్లు గుర్తించి ఇప్పటికే కొందరికి హెచ్చరికలు జారీచేశారు. వినియోగదారులకు కచ్చితంగా కొలత ప్రకారం ఇంధనం పోయాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో బంకులపై తనిఖీల్లో భాగంగా అధికారులు ఏడింటిపై కేసులు నమోదు చేసి, 26 పంపులు సీజ్‌చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు విసృ్తతస్థాయిలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఈనెల 16తో ఇవి ముగియనున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement