వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ అధికారులు, దళారి శ్రీకాంత్ (ఇన్‌సెట్) పట్టుకున్న డబ్బు
ఖమ్మంక్రైం: లంచాలకు అలవాటు పడి వ్యాపారులను పీక్కుతింటున్న ఓ అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా శనివారం పట్టుకున్నారు. జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి (తూనికలు కొలతలశాఖ)ఓ దళారి ద్వారా లంచం తీసుకొంటూ పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ క్రాస్‌రోడ్‌లో ఎస్‌ఎస్ వేబ్రిడ్జి నడుపుతున్న సిద్ధారెడ్డికి ఆగస్టు 8వ తేదీతో రెన్యువల్ అయిపోయింది. రెన్యువల్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న సిద్ధారెడ్డి దాని ఆమోదానికి అప్పటి నుంచి జిల్లా తూనికల కొలతలశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి గూడూరు అశోక్ బాబును పలుమార్లు కలిసాడు.
వైరా రోడ్‌కు చెందిన ఎలక్ట్రానిక్ కాంటాలు, వే బ్రిడ్జిలు బాగు చేసే ప్రైవేట్ మెకానిక్ వచ్చి మీ పని కావాలంటే రూ.10 వేలు లంచం కావాలని తనను అశోక్‌బాబు పంపించారని చెప్పాడు. దీంతో సిద్ధారెడ్డి అంత లంచం ఎలా తీసుకొంటారని ట్రంక్ రోడ్‌లో ఉన్న లీగల్ మెట్రాలజీ కార్యాలయానికి వెళ్లి అశోక్‌బాబును కలిసాడు. శ్రీకాంత్ చెప్పింది చేస్తేనే మీదరఖాస్తు ఆమోదిస్తామని చెప్పగా సిద్ధారెడ్డి అంత లంచం ఇచ్చుకోలేనని అనడంతో దర ఖాస్తును పెండింగ్‌లో పెట్టారు.
దీంతో సిద్ధారెడ్డి విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం సిద్ధారెడ్డి శనివారం జిల్లా అధికారి అశోక్‌బాబుకు ఫోన్ చేసి శ్రీకాంత్‌ను పంపించండి డబ్బులు ఇస్తానని చెప్పాడు. దీంతో శ్రీకాంత్ శనివారం సాయంత్రం వరంగల్ క్రాస్‌రోడ్‌లో ఉన్న వేబ్రిడ్జి వద్దకు వచ్చాడు. సిద్ధారెడ్డి రూ.13 వేలు ఇవ్వడంతో మాటు వేసిన ఏసీబీ బృందం శ్రీకాంత్‌ను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొన్నారు. డబ్బును స్వాధీనపర్చుకొని జిల్లా లీగల్ మెట్రాలజీ కార్యాలయానికి తీసుకొచ్చారు.
లంచం తీసుకొకున్న దళారీ శ్రీకాంత్ తనకు ఏ తప్పూ తెలియదని తాను ఆత్మహత్య చేసుకొటానని కావాలనే తనను ఏసీబీ అధికారులు ఇరికించారని కొద్దిసేపు హైడ్రామా సృష్టించాడు. దీంతో లీగల్ మెట్రాలజీ అధికారి అశోక్‌బాబు కూడా తనకూ ఏమీ తెలియదని.. తనకు, శ్రీకాంత్‌కు ఎటువంటి సంబంధంలేదని తాను కూడా ఆత్మహత్య చేసుకొంటానని డ్రామా ఆడాడు. లంచం తీసుకొన్న అధికారి అశోక్‌బాబు, దళారీ శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమణమూర్తి, ప్రవీణ్, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment