సాక్షి, అమరావతి: వ్యాపార దుకాణాలు, సూపర్ మార్కెట్లు, బంగారు ఆభరణాల విక్రయాల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. తూనికలు, కొలతల చట్టాన్ని గ్రామస్థాయి నుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. వినియోగదారుల హక్కులను సంపూర్ణంగా పరిరక్షించడంలో గ్రామ, వార్డు సచివాలయ (జీఎస్‌డబ్ల్యూఎస్) సిబ్బందిని భాగస్వాములను చేయనుంది.
దుకాణాల్లో సంప్రదాయ, ఎలక్ట్రానిక్ కాటా యంత్రాలను నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించడం, స్టాంపింగ్ ప్రక్రియలను పర్యవేక్షించేలా బాధ్యతలను వికేంద్రీకరించింది. ఇప్పటికే జీఎస్‌డబ్ల్యూఎస్‌లో సాంకేతిక అర్హత కలిగిన ఇంజినీరింగ్ సహాయక సిబ్బందిని గుర్తించింది. వీరికి వచ్చే వారంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నారు.
సిబ్బంది కొరతను అధిగవిుంచేలా..
వాస్తవానికి తూనికలు, కొలతల శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. తూకంలో మోసాలతో పాటు ప్యాకింగ్ ఉత్పత్తులపై ముద్రిత ధర కంటే ఎక్కువకు విక్రయించడం, ఎమ్మార్పీలు ముద్రించకపోవడం వంటి లోపాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పరిపాలన వికేంద్రీకరణలో కీలక భూమిక పోషిస్తున్న సచివాలయ వ్యవస్థను సమర్థంగా వినియోగించుకునేలా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే భౌతికశాస్త్రం చదివిన బీఈ, బీటెక్, బీఎస్సీ విద్యార్హత కలిగిన ఇంజినీరింగ్ సహాయకులను ఎంపిక చేసింది. తూనికలు, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణలో సచివాలయ ఇంజినీరింగ్ సహాయక సిబ్బంది స్థానికంగా వ్యాపార దుకాణాల్లో తనిఖీలు చేసి లోపాలు గుర్తించాలి.
తూకాల్లో తేడా, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించడం, గ్యాస్, పెట్రోల్ బంకుల్లో మోసాలు వంటి అంశాలపై ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా విధులను కేటాయిస్తూ పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీ హెచ్.అరుణ్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు గ్రామ, మండల స్థాయిలో ఎప్పటికప్పుడు వినియోగదారులకు అవగాహన కల్పించడంతోపాటు 1967 టోల్‌ఫ్రీ నంబరుపై చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment