సాక్షి, హైదరాబాద్: ఏదైనా బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగుతుంటే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే అత్యవసర నంబర్ ‘101’కు ఫోన్ చేసి ఫలానా చోట అగ్ని ప్రమాదం సంభవించిందని చెబుతారు. కానీ ఘటనాస్థలికి ఫైరింజన్లు చేరుకొనేలోగా భవనంలో చిక్కుకున్న వారికి ప్రాణాపాయం క్షణక్షణానికీ పెరుగుతుంటుంది.
ఆస్తినష్టమూ అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంటుంది. అయితే ఒకవేళ ప్రమాదం జరిగిన మరుక్షణమే భవనానికి కాపాలాగా ఉండే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందే ఫైర్‌ఫైటర్ల అవతారం ఎత్తగలిగితే ప్రాణ, ఆస్తినష్టాన్ని వీలైనంత మేర తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. సరిగ్గా ఈ ఆలోచనతోనే అగ్ని మాపకశాఖ వినూత్న కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
ఫస్ట్ రెస్పాండర్స్ కోసం ప్రత్యేకంగా..
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఎంత త్వరగా స్పందిస్తే అంత నష్ట తీవ్రత తగ్గుతుంది. అగ్ని ప్రమాద స్థలంలో ఉన్న వారి అప్రమత్తత సైతం ప్రాణాలు కాపాడటంలో, మంటల వ్యాప్తిని నియంత్రించడంలో కీలకం. అలాంటి ఫస్ట్ రెస్పాండర్స్ అయిన వారిని గుర్తించి అగ్నిప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర అగ్ని మాపకశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక జీఓను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు 30 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది.
ఇప్పటికే మొదటి బ్యాచ్‌లో 29 మందికి శిక్షణ మార్చి 29న ప్రారంభించినట్లు అగ్నిమాపకశాఖ డీజీ వై. నాగిరెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉండే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, పరిశ్రమలు, నివాస సముదాయాల్లో అందుబాటులో ఉండే వారికి అగ్ని ప్రమాదాల నియంత్రణ, ప్రమాద సమయంలో ప్రాణ, ఆస్తినష్టం నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి నేర్పడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని నాగిరెడ్డి వివరించారు.
ఫీజు రూ.5,000
గతంలో అగ్ని మాపక శాఖ నుంచి ప్రైవేటు వ్యక్తులకు శిక్షణ ఇచ్చేవారు. కానీ అది మూడు రోజులు మాత్రమే ఉండేది. దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో అగ్ని మాపకశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా 30 రోజుల శిక్షణకు అనుమతి తీసుకున్నారు. దాని ప్రకారం వట్టినాగులపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్విసెస్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రైవేటు వ్యక్తులకు శిక్షణ ప్రారంభించారు.
30 రోజులపాటు ఇచ్చే ఈ శిక్షణలో అన్ని రకాల అగ్నిప్రమాదాలు, ప్రమాదాల నియంత్రణలో అనుసరించాల్సిన విధానాలు, నివాసాలు, వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాల నిర్వహణ, అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన తదితర అంశాలను వారికి నేర్పుతున్నారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు, ప్రైవేటు ఆస్పత్రులు, పరిశ్రమలు, ఇతర రెసిడెన్షియల్ సొసైటీలలో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి ఈ శిక్షణ అందిస్తున్నారు.
తమ సిబ్బందికి శిక్షణ ఇప్పించాలనుకొనే ప్రైవేటు సంస్థలు అగ్ని మాపకశాఖ వెబ్‌సైట్‌లో ముందుగా దరఖాస్తు చేసుకుంటే బ్యాచ్‌లవారీగా శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణ కోసం ఒక్కో వ్యక్తి నుంచి ఫీజు కింద రూ. 5 వేలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇలా స్పాన్సర్స్ నుంచి తీసుకున్న మొత్తాన్ని శిక్షణ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment