ఎక్కడికెళ్లినా మోసమే.. | Consumers Are Deceiving In Vizianagaram | Sakshi
Sakshi News home page

ఎక్కడికెళ్లినా మోసమే..

Published Thu, Jul 18 2019 12:57 PM | Last Updated on Thu, Jul 18 2019 12:57 PM

Consumers Are Deceiving In Vizianagaram - Sakshi

తూనికలు, కొలతలు శాఖ జిల్లా కార్యాలయం

సాక్షి, విజయనగరం : వినియోగదారులు నిత్యం నిలువ దోపిడీకి గురవుతున్నారు. చిన్న కూరగాయల కొట్టు మొదలుకుని బంగారుషాపు వరకు ఎక్కడికెళ్లినా వినియోగదారుడిని మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. చివరకు రేషన్‌ డీలర్లు సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో దుకాణాల్లో వేసిన తూకం.. ఇంటికెళ్లి చూస్తే తేడా కనిపిస్తోంది. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన తూనికలు కొలతలు శాఖ సిబ్బంది కొరత పేరుతో చోద్యం చూస్తోంది. కిరాణ, వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ, హార్డ్‌వేర్, బంగారు షాపులు ఇలా వివిధ రకాల దుకాణాలు జిల్లాలో 24,301 ఉన్నాయి. చిరువ్యాపారులను కలుపుకుంటే 50 వేల మందికిపైగా ఉంటారు.

అయితే జిల్లా వ్యాప్తంగా తూకానికి సంబంధించి  ఏ ఏడాది కూడా 300కు మించి కేసులు నమోదు కాలేదు.  దీన్ని బట్టి చూస్తే తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా తనిఖీలు నిర్వహించేటప్పుడు కిరాణాదుకాణాలు, షాపుల యజమానుల నుంచి రూ. 1200 నుంచి రెండు వేల రూపాయల వరకు వసూలు చేసి రూ. 200కే రశీదు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే మరింత ఇబ్బందులకు గురి చేస్తారని దుకాణదారులు వాపోతున్నారు. కాటాలకు సీళ్లు వేసేందుకు కూడా అక్కడి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా థియేటర్లలో ఎక్కడ కూడా కూల్‌ డ్రింక్స్,తిను బండారాలపై ఎంఆర్‌పీ వసూలు చేస్తున్న దాఖలాలు లేవు. అధిక ధరలకు విక్రయిస్తుండడంపై ఫిర్యాదులు అందుతున్నా చర్యలు తీసుకోకపోవడం విశేషం.

నిర్ధిష్ట ప్రమాణాలుంటాయి...
 ఘన పదార్థాలైతే తూకాలు, ద్రవ పదార్థాలైతే కొలతల్లో కొలుస్తారు. వీటికి నిర్థిష్ట ప్రమాణాలుంటాయి. అయితే కొందరు వ్యాపారులు ధన దాహంతో జిమ్మిక్కులు చేస్తున్నారు. వినియోగదారునికి తెలియకుండానే మోసం చేస్తున్నారు. తూనికలు– కొలతలు శాఖ నిబంధనల ప్రకారం.. వ్యాపారి ప్రతి రెండేళ్లకు ఒకసారి తప్పనిసరిగా తూకం రాళ్లు, ప్రతి ఏటా కాటాకు ప్రభుత్వ పరమైన ముద్రలు వేయించుకోవాలి. కాటాలో తేడాలు వస్తే సరి చేయించుకోవాలి. అలా చాలా మంది వ్యాపారులు చేయించుకోవడం లేదు. తూనికలు కొలతలు శాఖ కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో వ్యాపారులు అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.

కూరగాయల వ్యాపారమే ఎక్కువ..
జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో కూరగాయల వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. తూకం కాటాలతో మోసం చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్‌ కాటాలతో తూకం వేస్తున్నా అందులో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ముందుగానే వంద గ్రాముల తగ్గించి జీరో వచ్చేలా అమర్చుతున్నారు. కొన్ని దుకాణాల్లో కాటాపై ఉన్న పళ్లెం బరువును లెక్కించకుండా తూకంలో కలిపేసి మోసాలకు పాల్పడుతున్నారు. కిలోకు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. 

గ్యాస్‌లోనూ చేతివాటం
వంటగ్యాస్‌ సిలిండర్‌ తూకంలోను వ్యత్యాసం ఉంటోందని వినియోగదారులు వాపోతున్నారు. సిలిండర్లను తూకం వేయకుండానే అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలలకు రావాల్సిన సిలిండర్‌ కేవలం 40 రోజులకే అయిపోతుందని గృహిణులు గగ్గోలు పెడుతున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement