‘తూనికలు, కొలతలు’ ఏవి? l
‘తూనికలు, కొలతలు’ ఏవి? l
Published Wed, Oct 19 2016 4:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
జిల్లా మొత్తానికి నలుగురే సిబ్బంది
వినియోగదారులను దోచుకుంటున్న వ్యాపారులు
అరకొర దాడులతో సరిపెడుతున్న అధికారులు
ఖమ్మం క్రైం: ‘నగరానికి చెందిన రాజేష్ సెంటర్‌కు వచ్చి కేజీ ద్రాక్ష పండ్లు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి చూశాక పొట్లంలో చాలా తక్కువగా ద్రాక్ష పండ్లు ఉన్నాయి. అనుమానంతో తన ఇంటి వద్ద ఉన్న దుకాణంలో కాంటా వేసి చూడగా అవి అరకేజీ ఉన్నాయి. ఖంగుతిన్న రాజేష్ వ్యాపారి దగ్గరికి వెళ్లి అడిగాడు. వ్యాపారి రాజేష్‌నే దబాయించాడు’. సుబ్బారావు తన ద్విచక్రవాహనంలో పెట్రోల్ పోసుకునేందుకు ఓ బంక్‌కు వెళ్లాడు. రూ.100 పెట్రోల్ పోసుకుని బయటకు పనిమీద వెళ్లి వెంటనే తిరిగి వచ్చాడు. అదే రోజు సాయంత్రం బయటకు వెళ్లగా దారిలో పెట్రోల్ అయిపోయింది. ఉదయం రూ.100 పెట్రోల్ కొట్టించా, అంతలోనే అయిపోయిందేంటని ఆరాతీయగా అది పెట్రోల్ బంక్‌లో జరిగిన మోసం అని అర్థం అయింది’. ఇది రాజేష్, సుబ్బారావు సమస్య లాంటి వారి సమస్య కాదు. ప్రతి వినియోగదారుడు ఎక్కడో ఓ చోట మోసపోతూనే ఉన్నాడు. ఇలాంటి మోసాలను అరికట్టాల్సిన బాధ్యత తూనికలు, కొలతలశాఖది. అయితే, జిల్లాలో ప్రస్తుతం ఆ శాఖ.. కాంటాల్లోని రాళ్ల వలె తుప్పుపట్టి పోయిందనే విమర్శలు వినబడుతున్నాయి.
దాడులు ఏవీ?
తూనికలు, కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ) సిబ్బంది ప్రతి వారం అన్ని దుకాణాల్లో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సిబ్బంది నెలల తరబడి దాడులు చేయకపోవటంతో వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా తూకాల్లో మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను దారుణంగా దోపిడీకి గురిచేస్తున్నారు. కాంటాల్లో తుప్పుపట్టిన రాళ్లను వేస్తూ, కాంటా రాయిలకు బదులు రోడ్లపై దొరికే రాళ్లను వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తోపుడు బండ్ల వ్యాపారుల దగ్గర నుంచి పెద్దపెద్ద దుకాణాల వ్యాపారుల వరకు తమకు తోచిన రీతిలో దోచుకుంటున్నారు.
జిల్లా మొత్తానికి నలుగురే సిబ్బంది....
నగరంలోని త్రీటౌన్ పరిధిలోని ట్రంక్‌రోడ్‌లో ఉన్న జిల్లా తూనికలు, కొలతల శాఖలో జిల్లా తూనికల శాఖా అధికారితోపాటు ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు, ఒక అటెండర్ ఉన్నారు. వారంతా జిల్లా మొత్తం తిరగాల్సిందే. ఒక్క ఖమ్మం నగరంలోనే ఎన్నో దుకాణాలుండగా వాటిపైనే సరైన నియంత్రణ లేదు. కాగా, జిల్లా మొత్తం ఉన్న దుకాణాలపై ఈ నలుగురు సిబ్బందే దాడులు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు పలు దుకాణాల నుంచి నెలానెలా మామూళ్లు సిబ్బందికి భారీగానే ముడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
సిబ్బంది కొరత ఉంది...
జిల్లా రెండుగా విడిపోక ముందు ఈ నలుగురు సిబ్బందికి తోడు మరో ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లు ఉండేవారు. నూతనంగా భద్రాది జిల్లా ఏర్పడిన తర్వాత వారిద్దరు అక్కడకు వెళ్లిపోయారు. ఉన్న సిబ్బందితోనే దుకాణాలను తనిఖీ చేస్తున్నాం. నలుగురే సిబ్బంది ఉండటంతో ఇబ్బంది ఏర్పడుతోంది. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.
బిట్ల రవీందర్, జిల్లా తూనికలు, కొలతల అధికారి
Advertisement
Advertisement