
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం మాదేనని, మరికొద్ది రోజుల్లో ఆ చిహ్నం మళ్లీ చేతికి రానున్నట్టు సీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్ మద్దతు నేతలు ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలను శుక్రవారం ఢిల్లీలో సీఈసీకి నివేదిక రూపంలో అందజేశారు. త్వరగా చిహ్నాన్ని కేటాయించాలని విన్నవించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక సమయంలో రెండాకుల చిహ్నం కోసం అన్నాడీఎంకేలో గ్రూపులుగా ఉన్న ఈపీఎస్, ఓపీఎస్‌ల శిబిరాల మధ్య తీవ్ర సమరం సాగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో రెండాకుల చిహ్నం సీజ్ చేశారు. రెండాకులు పోయి, ఆ ఎన్నికలు ఆగడంతో తదుపరి పార్టీని, చిహ్నాన్ని చేజిక్కించుకునేందుకు ఓపీఎస్, ఈపీఎస్ తీవ్ర కుస్తీలు పట్టారు.
వేర్వేరుగా ఎన్నిక యంత్రాంగానికి ప్రమాణ పత్రాల రూపంలో సమర్పించారు. ఈ వ్యవహారం విచారణలో ఉన్న సమయంలో ఈపీఎస్, ఓపీఎస్ ఏకమయ్యారు. దీంతో ఇద్దరు కలిసి చిహ్నం, పార్టీని చిన్నమ్మ శశికళ అండ్ బృందం నుంచి రక్షించుకునే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశానికి పిలుపు నిచ్చి, అందులో చిన్నమ్మను సాగనంపుతూ తీర్మానాలు చేశారు. అన్నాడీఎంకే తమదేనని, చిహ్నం తమకే దక్కాలన్న కాంక్షతో తీర్మానాలు ఇటీవల చేశారు. వీటిని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించే పనిలో ఈపీఎస్, ఓపీఎస్ మద్దతు నేతలు నిమగ్నమయ్యారు. ఇది వరకు ఓ మారు ఢిల్లీ వెళ్లినా, వీరికన్నా ముందుగా తమతో సంప్రదింపులు జరపకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదంటూ చిన్నమ్మ ప్రతినిధి దినకరన్ సీఈసీకి లేఖ సమర్పించడంతో వెనక్కు తగ్గక తప్పలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈపీఎస్ తరఫున మంత్రులు జయకుమార్, సీవీ షణ్ముగం, ఆర్‌బీ ఉదయకుమార్, ఓపీఎస్ తరఫున మాజీ మంత్రి మునుస్వామి, ఎంపీ మైత్రేయన్, మాజీ స్పీకర్ పీహెచ్ పాండియన్ ఢిల్లీ వెళ్లారు.
రెండాకులు మావే : అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, హాజరైన సభ్యుల వివరాలు, తీర్మానాలు తదితర అంశాలను నివేదిక రూపంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఢిల్లీలో ఈ నేతలు సమర్పించారు. ముక్తకంఠంతో, ఏకాభిప్రాయంతో సర్వ సభ్య సమావేశంలో చేసిన తీర్మానాల మేరకు అన్నాడీఎంకే తమదేనని, రెండాకుల చిహ్నం తమకే దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో కేపీ మునుస్వామి మాట్లాడుతూ, అన్ని వివరాలను సీఈసీ ముందు ఉంచామని వివరించారు.
సర్వ సభ్య సమావేశాలకు హాజరైన వారందరి వివరాలు, రాని వారు తమకు సమర్పించిన లేఖలు తదితర అంశాలను సైతం సీఈసీ ముందు ఉంచామని పేర్కొన్నారు. మంత్రి జయకుమార్ మాట్లాడుతూ, అన్నాడీఎంకే చిహ్నం రెండాకులు 100 శాతం తమదేనని, త్వరలో ఆ చిహ్నం తమకు మళ్లీ దక్కనుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా తమను ఏమీ చేయలేరని పేర్కొన్నారు. చిహ్నం తమ చేతికి రాగానే, అన్నాడీఎంకే బలం ఏమిటో , సత్తా ఏమిటో మరోమారు చాటుతామన్నారు. పార్టీలో కనీసం సభ్యుడు కూడా కాని దినకరన్ ఎలా అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి పిలుపునిస్తున్నాడో చూస్తామని, ఆయన దూకుడుకు కల్లెం వేస్తామని హెచ్చరించారు.