సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచ భౌగోళిక చిత్రపటంలో తమిళనాడు సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. అంతరిక్ష ప్రయోగాలకు ఏకైక కేంద్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సరసన తూత్తుకూడి జిల్లా కులశేఖరపట్టిలో ప్రతిష్టాత్మకంగా రెండో అంతరిక్ష ప్రయోగ కేంద్రం స్థాపనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలించి...
శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో రెండు లాంచింగ్ ప్యాడ్ (1,2)లు ఉన్నాయి. భవిష్యత్తులో మరో రెండు లాంచింగ్ ప్యాడ్‌లు అవసరమని భావిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు, దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించి అనువైన భూమికోసం అన్వేషించారు. తూత్తుకూడి జిల్లా తిరుచెందూరుకు సమీపంలోని కులశేఖరపట్టి అనుకూలమని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కులశేఖరపట్టిలో 3, 4 లాంచింగ్ ప్యాడ్‌లను నిర్మించేందుకు కేంద్రం సైతం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సమావేశాల్లో గతవారం కేంద్ర అణుశక్తి శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఈ విషయాన్ని నిర్ధారించారు.
రిస్క్ తక్కువ, ఇంధనం ఆదా...
కులశేఖరపట్టి అంతరిక్ష ప్రయోగాల నుంచి చేసే ప్రయోగాలతో ఎన్నో లాభాలున్నాయి. శ్రీహరికోట నుంచి ప్రయోగాలు చేసేటపుడు వాహక నౌకను దక్షిణం వైపునకు మాత్రమే పయనింపజేయాల్సి ఉంది. అయితే దక్షిణం వైపున శ్రీలంక దేశం ఉంది. అంతరిక్ష ప్రయోగాలు చేసేపుడు మరో దేశం మీదుగా వాహక నౌక ప్రయాణించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. వాహక నౌక ప్రయోగం విఫలమైతే దారితప్పి శ్రీలంకపైకి వెళ్లకుండా సముద్రంలోనే కూల్చివేసేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. అధిక శ్రమకోర్చి దిశను మార్చడం వల్ల దూరంతోపాటు ఖర్చూ పెరుగుతున్నట్లు చెబుతున్నారు. కులశేఖరపట్టి నుంచి ప్రయోగిస్తే దారిమళ్లించే అవసరం ఉండదని విశ్వసిస్తున్నారు. శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తే శ్రీలంక చుట్టూ తిరుగుతూ నాలుగు దశల్లో విడిపోతూ గమ్యానికి చేరుకోవాల్సి ఉంటుంది. కులశేఖరపట్టినుంచయితే మూడు దశలే సరిపోతాయి. ఇంధనం ఎంతో ఆదా అవుతుంది.
మరింత బరువైన వాహక నౌకల ప్రయోగానికి అనుకూలం...
కులశేఖరపట్టి భూమధ్య రేఖకు అతి సమీపంలో ఉంది. శ్రీహరికోట కేంద్రంలోని భూమికి గరిష్టంగా 1,350 కిలోల బరువైన వాహక నౌకను ప్రయోగించగల సామర్థ్యం ఉండగా, కులశేఖరపట్టి వద్ద భూమికి 1,800 కిలోల బరువును తట్టుకోగల శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కారణాలవల్లే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. తొలిదశగా కులశేఖరపట్టి పరిధిలోని మూడు గ్రామాల్లో 2,300 ఎకరాల భూ సేకరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. తిరుచెందూరులో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటుచేసి ఎనిమిది విభాగాలకు చెందిన అధికారులు పనులు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment