ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాతలు ఇచ్చిన చెన్నైలోని సదావర్తి సత్రం భూములను తక్కువ ధరకు ఏపీలోని ల్యాండ్‌మాఫియాకు అప్పగించేకంటే తమిళనాడులో నివసిస్తున్న తెలుగువారి ప్రయోజనాలకు కేటాయించడం ఉత్తమమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే నారాయణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడుకు చెందిన సీపీఐ నేతలతో కలిసి చెన్నై తాలంబూరు, దాని పరిసరాల్లోని సత్రం భూముల్లో నారాయణ శుక్రవారం పర్యటించారు. సత్రం భూముల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి భూములు విలువ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేవలం చెన్నైలోనే 32 లక్షల మంది తెలుగువారు ఉన్నారంటే మొత్తం తమిళనాడులోని మొత్తం తెలుగు జనాభాను కలుపుకుంటే పెద్ద సంఖ్యలో ఉంటారని చెప్పారు. వీరిలో తెలుగు ప్రజానీకానికి, తెలుగు సాహిత్యానికి ఉపయోగపడేవారు ఎందరో ఉన్నారని తెలిపారు. అంతేగాక ఎంతో మంది తెలుగు ప్రజలు సొంతిల్లు లేక పేదరికంలో మగ్గుతున్నారని అన్నారు.
సత్రం భూముల అమ్మకాల్లో తమిళనాడులోని తెలుగు ప్రజల స్థితిగతులను సైతం పరిగణనలోకి తీసుకోవాలేగానీ,లాండ్ మాఫియా గ్యాంగ్ పంచుకోవడానికి చేసే ప్రయత్నాలను మేము అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. సబ్ రిజిష్ట్రారు కార్యాలయ సమాచారం ప్రకారం గైడ్ ఎకరా రూ.4.85 కోట్లు పలుకుతుండగా 83.11 ఎకరాలను ఏపీ ప్రభుత్వం వేలం పాటల ద్వారా రూ.22 కోట్లకే ల్యాండ్ మాఫియాకు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని అన్నారు. ప్రభుత్వ కుటిలయత్నాలను హైకోర్టులో ప్రజా ప్రయోజనవాజ్యం (పిల్) వేయడం ద్వారా మంగళగిరి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అడ్డుకున్నారని తెలిపారు.
అయితే హైకోర్టు సైతం ప్రభుత్వానికి సరైన సూచన ఇవ్వకుండా అదనంగా రూ.5 కోట్లు చెల్లించి ఆర్కేనే భూములను తీసుకొమ్మని చెప్పిందని విమర్శించారు. ఇంతలో ఏపీ ప్రభుత్వం మళ్లీ పేచీపెట్టి ఈనెల 18వ తేదీన రెండోసారి వేలానికి తెగబడి రూ.60.30 కోట్లకు అమ్మేందుకు సిద్దమైందని అన్నారు. రూ.500 కోట్ల విలువ చేసే భూములను తమ ప్రభుత్వానికి అనుకూలమైన ల్యాండ్ మాఫియాకు కారుచౌకగా కట్టబెట్టేందుకే ఈ వేలం పాటలని ఆయన వ్యాఖ్యానించారు. సత్రం భూములు వివాదాస్పదం, వాటిని తాము సెటిల్ చేసుకోలేము కాబట్టే వేలం పాటల ద్వారా ప్రయివేటు వ్యక్తులకు అమ్ముతున్నామని కుంటిసాకులు చెబుతోందని ఆయన దుయ్యబట్టారు. కొందరు ప్రయివేటు వ్యక్తుల కంటే ఏపీ ప్రభుత్వం బలహీనమైనదాని ఆయన ఎద్దేవా చేశారు.
తాము అసమర్దులము, ప్రయివేటు వాడు గొప్పవాడని ప్రభుత్వ పెద్దలు అంగీకరించారని అన్నారు. ఈ చేష్టలు ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికే కాదు తెలుగు ప్రజానీకానికి అవమానమని ఆయన అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్దిగా తలచకుంటే కష్టమేముంది, సీఎం స్థాయిలో తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే రెండు ప్రభుత్వాలు కలిసి భూములను స్వాధీనం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సత్రం భూములను ల్యాండ్ మాఫియాకు పంచాలని ఉద్దేశ్యపూర్వకంగా సాగించిన ప్రయత్నాల వల్ల సమస్య జఠిలమైందని అన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుని ఒక పాలసి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, కాదని వేలం పాటలు నిర్వహిస్తే అడ్డుకుంటాం, సుప్రీం కోర్టులో కూడా మా వాదం వినిపించేందుకు పిటిషన్ వేయబోతున్నామని చెప్పారు.