రాజ్ భవన్ వైపుగా దూసుకెళ్తున్న డీఎంకే నాయకులు, కార్యకర్తలు
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఓ ఏజెంట్ అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ, రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలో తొక్కే రీతిలో వ్యవహరిస్తున్న ఆయన్ను తప్పించాల్సిందేనని నినదించారు.
సాక్షి, చెన్నై : బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సమీక్షలు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాలంటూ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ జిల్లాల పర్యటనల్ని సాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. రాజ్‌భవన్ మరో సచివాలయంగా మారిందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా, నల్ల జెండాలతో వ్యతిరేకత, నిరసన వ్యక్తంచేసినా గవర్నర్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, ఆందోళనల్ని ఖాతరు చేయకుండా తన దారిలో తాను ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం గవర్నర్ నామక్కల్ పర్యటన సందర్భంగా డీఎంకే నల్ల జెండాల ప్రదర్శన వివాదానికి దారితీసింది.
నల్ల జెండాల్ని ప్రదర్శించిన డీఎంకే వర్గాలను బలవంతంగా పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ, ఛలో రాజ్ భవన్ నిర్ణయాన్ని హఠాత్తుగా డీఎంకే తీసుకుంది. శనివారం ఉదయాన్నే స్టాలిన్ ఇచ్చిన పిలుపుతో డీఎంకే ఎమ్మెల్యేలు అన్భళగన్, ఎం.సుబ్రమణియన్, శేఖర్ బాబు, మాధవరం సుదర్శనం, రంగనాథన్, వాగై చంద్రశేఖర్, మోహన్, రవిచంద్రన్, అరవింద్ రమేష్‌లతో పాటు కేంద్రమాజీ మంత్రి రాజ తదితర నేతలు ఉదయాన్నే పెద్దఎత్తున కేడర్‌తో సైదాపేట కోర్టు వద్దకు చేరుకున్నారు.
దూసుకొచ్చిన నేతలు
పది గంటల సమయంలో అక్కడికి స్టాలిన్ చేరుకున్నారు. ఆయన రాకతో ఒక్క సారిగా వాతావరణం అక్కడ మారింది. గవర్నర్ తీరును, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, నామక్కల్‌లో తమ వాళ్లతో పోలీసులు వ్యవహరించిన విధానాన్ని ఖండిస్తూ, నిరసిస్తూ నినాదాల్ని హోరెత్తించారు. ఓ వైపు నినాదాలు మిన్నంటుతుంటే, మరో వైపు ఎమ్మెల్యేలతో కలిసి డీఎంకే జెండాను చేతబట్టి రాజ్ భవన్‌వైపు స్టాలిన్ కదిలారు. పెద్ద ఎత్తున డీఎంకే కేడర్ దూసుకురావడంతో ఉత్కంఠ నెలకొంది. రాజ్ భవన్‌కు అతి సమీపంలో రోడ్డును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
బ్యారికేడ్లను ఏర్పాటుచేసి, ఎవరూ అటు వైపు రాకుండా అడ్డుకున్నారు. అయినా, డీఎంకే వర్గాలు పోలీసుల వలయాన్ని ఛేదించే రీతిలో ముందుకు దూసుకురావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజ్ భవన్‌వైపుగా డీఎంకే వర్గాలు చొచ్చుకు రాని రీతిలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. దీంతో రోడ్డు మీద డీఎంకే వర్గాలు బైఠాయించి రాస్తారోకోకు దిగారు. ఈ ఆందోళన కారణంగా సైదా పేట నుంచి గిండి మార్గం, అడయార్ వైపుగా మార్గాల్లో ఎక్కడికక్కడ వాహనాలు ఆగాయి. ట్రాఫిక్‌ను క్రమ బద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు స్టాలిన్ సహా ఎమ్మెలేల్ని అడ్డుకుని బలవంతంగా అరెస్టుచేశారు. వీరందర్నీ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఉంచారు.
స్టాలిన్ ఫైర్
స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్ర హక్కుల్ని గవర్నర్ కాలరాస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గవర్నర్ కేంద్రానికి ఏజెంట్‌గా ఇక్కడ అడుగు పెట్టి ఉన్న దృష్ట్యా, ఎక్కడ తమ అవినీతి బండారాలు బయట పడుతాయోనన్న భయంతో ఈ పాలకులు గవర్నర్ విషయంలో మౌనం వహిస్తున్నారని ఆరోపించారు.
ఆది నుంచి గవర్నర్ చర్యల్ని డీఎంకే అడ్డుకుంటూ వస్తోందని, ఆయన ఎక్కడికి వెళ్లినా వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తప్పును సరిదిద్దుకోవాల్సిన గవర్నర్, ఇష్టానుసారంగా ముందుకు సాగడాన్ని ఖండిస్తున్నామన్నారు. అందుకే నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నామని పేర్కొంటూ, ఈ సమయంలో నామక్కల్‌లో తమవాళ్ల మీద బల ప్రయోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఇన్నాళ్లు తాము శాంతియుత మార్గంలో పయనించామని, అయితే, నామక్కల్ ఘటనతో తమను గవర్నర్ రెచ్చగొడుతున్నట్టుందని ధ్వజమెత్తారు. ఇలాంటి గవర్నర్‌ను తప్పించాలని, లేదా తన పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment