
సాక్షి, చెన్నై: ఓ వైపు డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం క్షీణించిందని.. అదేవిధంగా అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం విషమించిందంటూ వదంతులు వ్యాపించడంతో తమిళనాడులో హైఅలర్ట్ విధించారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు మంగళవారం చెన్నై చేరుకోవడంతో అసలు ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. డీజీపీ రాజేంద్రన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల ఎస్పీలకు హై అలర్ట్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెలవుల్లో ఉన్న పోలీసులు కూడా విధులకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. కరుణానిధి ఆరోగ్యంపై వదంతులను ఆయన కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు.
మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శశికళ భర్త నటరాజన్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో ఆయన కోసం చిన్నమ్మ పెరోల్ మీద వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అనంతరం ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా ఆమె మద్దతుదారులు వీరంగం సృష్టించొచ్చన్న రహస్య సమాచారంతో భద్రతను పెంచినట్లు మరో రకమైన ప్రచారం జరుగుతోంది.