తమిళనాడులో 100 రోజుల్లో ఎన్నికలు వస్తే, రాజకీయాల్లోకి వచ్చి, ఒంటరిగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు లోకనాయకుడు కమలహాసన్ తెలిపారు. రాజకీయాల గురించి సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చర్చిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ తాజా వ్యాఖ్యలతో కమల్ 100 రోజుల నినాదం నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తారా రారా అన్న చర్చ ఊపందుకుంది.
సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లోకనాయకుడు కమలహాసన్ దూకుడు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని గురి పెట్టి ఆయన తీవ్రంగానే తొలుత విరుచుకు పడుతూ వచ్చారు. తదుపరి ప్రజా సమస్యల మీద ప్రస్తావించడం మొదలెట్టారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం అంటూ ముందుకు సాగే పనిలో పడ్డారు. అలాగే, కేరళ సీఎం పినరాయ్ విజయన్‌తో భేటీ సాగడం, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌తో భేటీ చర్చకు దారి తీయడం వంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాజకీయాల్లోకి వస్తానన్నట్టుగా స్పం దించే కమల్, తదుపరి అందుకు ఓ వివరణ ఇవ్వడం, మళ్లీ చర్చకు తెరలేపడం, ఆ చర్చ ఆధారంగా మరికొన్ని కామెంట్లు చేయడాన్ని ఓ బాటగా చేసుకుని ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంద రోజుల్లో ఎన్నికలు వస్తే రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధం అని ప్రకటించడమే కాదు, ఒంటరిగానే ఎదుర్కొంటానన్న ధీమాను వ్యక్తం చేశారు. అయితే, వందరోజుల్లోపు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేనా, కమల్ రాజకీయాల్లోకి వచ్చేనా, లేదా అన్న చర్చ ఊపందుకోవడం గమనార్హం.
వంద రోజుల్లో : తమిళనాడులో సాగుతున్న అన్నాడీఎంకే ప్రభుత్వం ఓ బలవంతపు పెళ్లితో పోల్చుతూ కమల్ స్పందిచారు. ఈ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నట్టు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వంద రోజుల్లోపు ఎన్నికలు వస్తే, రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమని, ఒంటరిగానే ఆ ఎన్నికలు ఎదుర్కొంటానన్న ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ గురించి, ఎప్పుడు వస్తారు, ప్రకటిస్తారు అన్న ప్రశ్నలకు వంద రోజుల డెడ్‌లైన్‌ను సూచిస్తూ దాటవేత ధోరణి అనుసరించడం గమనార్హం. దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో తరచూ చర్చిస్తుంటానని, రాజకీయాల గురించి వివాదిస్తుంటానని , అయితే, ఆయన మార్గం వేరు, నా మార్గం వేరు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం గమనార్హం. అయితే, కమల్ వ్యాఖ్యలు డొంక తిరుగుడు సమాధానాలతో ఉండడంతో ఇంతకీ రాజకీయాల్లో వస్తారా, రారా తేలుస్తారా, తేల్చరా అన్నట్టుగా మీడియాల్లో , సామాజిక మాధ్యమాల్లో చర్చ జోరందుకోవడం గమనించ దగ్గ విషయం. కమల్ వ్యాఖ్యలపై మంత్రులు జయకుమార్, కేటీ రాజేంద్ర బాలాజీ స్పందిస్తూ... రూ. కోటి ఖర్చుపెట్టి ఓ సినిమా తీసి, అందులో హీరోగా నటిస్తే చాలు.. గంట వ్యవధి సీఎం అయిపోవచ్చని ఎద్దేవా చేశారు. కమల్ పగటి కలలు కనడం మానుకుంటే ఆయనకే మంచిదని హితబోధ చేశారు.
రజనీ మద్దతు : ఓవైపు కమల్ తన దైన శైలిలో స్పందిస్తుంటే, మరో వైపు ప్రధాని మోదీకి మద్దతుగా రజనీకాంత్ ట్విట్టర్లో› స్పందించడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛతే సేవ కార్యక్రమానికి మద్దతు పలుకుతూ స్పందించారు.