తమిళనాట పట్టు సాధించడం లక్ష్యంగానే బన్వరిలాల్ పురోహిత్‌ను కేంద్రంలోని బీజేపీ పాలకులు ప్రథమ పౌరుడిగా రంగంలోకి దించారు. రాజకీయాల్లోనే కాదు, పాలనపరంగా పట్టున్న పురోహిత్, ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు మీద ప్రయోగించిన అస్త్రంగా చెప్పవచ్చు. ఇందుకు బలాన్ని చేకూర్చే రీతిలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం.
సాక్షి, చెన్నై : రాష్ట్ర గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల వరకు రాజ్‌భవన్ వరకే పరిమితం అన్నట్టుగా బన్వరి లాల్ పురోహిత్ వ్యవహరించారు. రెండు రోజుల క్రితం తమిళనాట ఇక, తానే పాలన అన్నట్టుగా ఆయన వేసిన తొలి అడుగు చర్చకు, వివాదానికి దారితీసింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఏ విధంగా మారారో, దానికి రెట్టింపుగా, ఏకంగా తమిళనాడు పాలనను పురోహిత్ తన గుప్పెట్లోకి తీసుకునే పనిలో పడ్డట్టు సమాచారం. అదే సమయంలో కిరణ్ బేడీని అనుసరిస్తూ పురోహిత్ ముందుకు సాగుతున్నారనే చర్చ బయలుదేరింది. అయితే, తనను కాదు, ప్రధాని నరేంద్ర మోదీని అనుసరిస్తూ పురోహిత్ పయనం అన్నట్టు కిరణ్ తాజాగా వ్యాఖ్యానించడం గమనించ దగ్గ విషయం.
ప్రధాని పిలుపు మేరకే..
పురోహిత్ తనను అనుసరిస్తున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఓ మీడియాతో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన గవర్నర్ల మహానాడులో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా ఆదేశాలు వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రసంగాల్లో ప్రజలతో మమేకం కావాలని, ప్రజల్లో ఒకరిగా వారికి దగ్గర కావాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించినట్టు వివరించారు. అందుకే తాను, ప్రజల్లోకి వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు, ఆయన ఆకాంక్ష మేరకు పురోహిత్ తమిళనాడులో చొచ్చుకు వెళ్తున్నారేగానీ, తనను అనుసరించడం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడే దగ్గరుండి వారి సమస్యలు తెలుసుకునేందుకు వీలుందన్నారు.
రాజ్‌భవన్‌కే పరిమితం కాదు
గవర్నర్ అంటే, రాజ్‌భవన్‌కే పరిమితం కావాలన్న రూల్ లేదని, ప్రజల్లోకి వెళ్లేందుకు, సమావేశాలు నిర్వహించేందుకు తగ్గ అధికారాలు ఉన్నట్టు వివరించారు. గవర్నర్‌కు అధికారాలు లేనప్పుడు, ఎందుకు అన్ని ఫైల్స్ సంతకం కోసం, ఆమోదం కోసం రాజ్ భవన్‌కు వస్తున్నాయని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాజ్ భవన్‌కే పరిమితం కావాల్సిన అవసరం లేదని, ఇక ప్రతి గవర్నర్ ప్రజల్లోకి వెళ్తారని, వారికి దగ్గరగా ఉండి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment