
ఇండియన్స్ ఇష్టపడే ఫోన్ ఏదో తెలుసా?
భారత వినియోగదారులు ఎక్కువగా షియోమి స్మార్ట్ ఫోన్లను ఇష్టపడుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది.
భారత వినియోగదారులు ఎక్కువగా షియోమి స్మార్ట్ ఫోన్లను ఇష్టపడుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. శామ్ సంగ్, యాపిల్, లెనొవో, వన్ ప్లస్, మైక్రోమ్యాక్స్ లాంటి టాప్ బ్రాండ్లను తోసిరాజని చైనా కంపెనీ షియోమి అగ్రస్థానంలో నిలవడం విశేషం. భారతీయుల్లో మోస్ట్ పాపులర్, వాంటెడ్ బ్రాండ్ గా షియామి నిలిచిందని స్ట్రాటజీ ఎనలిటిక్స్ సర్వే తెలిపింది.
తాము ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్ ఫోన్లను పక్కకు పెట్టి ఈ ఏడాదిలో షియామి ఫోన్లు తీసుకోవాలనుకుంటున్నట్టు సర్వేలో 26 శాతం మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు చెప్పారు. శామ్ సంగ్ ఫోన్లు కావాలనుకుంటున్న వారికి కంటే ఈ సంఖ్య రెట్టింపు. దాదాపు 12 శాతం మంది శామ్ సంగ్ వైపు మొగ్గు చూపారు. ఆన్ లైన్ లో కొనుక్కునే సౌలభ్యం, నెట్ వర్క్ స్పీడ్, చిప్ సెట్ పనితీరు, కెమెరా, స్క్రీన్ పరిమాణం, రిజల్యూషన్ తదితర ఫీచర్లను వినియోగదారులు పరిగణనలోకి తీసుకుంటున్నారని స్ట్రాటజీ ఎనలిటిక్స్ నివేదిక వెల్లడించింది.
భారత్ లో ఆన్ లైన్ అమ్మకాల్లోనూ షియోమి ముందుంది. 29.3 మార్కెట్ వాటాతో షియోమి అగ్రస్థానంలో ఉందని ఎనలిస్ట్ సంస్థ ఐడీసీ తెలిపింది. 'ఇండియా స్మార్ట్ ఫోన్ పరిశ్రమ రోజురోజుకు మారుతోంది. వినియోగదారులు టెక్నాలజీని సమర్థవంతంగా అర్థం చేసుకుంటూ తమకు కావాల్సిన ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లనే ఎంచుకుంటున్నారు. భారత మార్కెట్ లో షియోమి దూసుకుపోతోంది. షియోమి ఫోన్ల అమ్మకాల్లో 125 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది కొత్త ఫోన్ కొనాలకునే ఆండ్రాయిడ్ యూజర్లలో ఎక్కువ మంది షియోమి బ్రాండ్ పట్ల మొగ్గు చూపుతున్నార'ని స్ట్రాటజీ ఎనలిటిక్స్ సీనియర్ ఎనలిస్ట్ రాజీవ్ నాయర్ తెలిపారు.