సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా రెవెన్యూ వ్యవస్థను వేధిస్తున్న కీలక సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. వ్యవసాయ భూములకు సంబంధించిన క్రయ, విక్రయ లావాదేవీలను మాన్యువల్‌గా రికార్డు చేస్తుండటంతో ఏర్పడిన డబుల్ ఖాతాల సమస్యకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. భూముల లావాదేవీల్లో అమ్మకందారు, కొనుగోలుదారు వివరాలతో పాటు పౌతి మార్పులను కచ్చితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసే ‘మార్పుల రిజిస్టర్’ను శనివారం అందుబాటులోకి తెచ్చింది.
గతం.. అంతా గందరగోళం
భూముల క్రయ, విక్రయ లావాదేవీల్లో ఎప్పటికప్పుడు జరిగే మార్పులను నమోదు చేసే వ్యవస్థ మొదటి నుంచీ ఉంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత కారణంగా ఆ లావాదేవీలను మాన్యువల్‌గా నమోదు చేసేవారు. ఉదాహరణకు ‘ఏ’అనే వ్యక్తి తనకున్న రెండెకరాల భూమిలో ఎకరం భూమిని ‘బీ’ అనే వ్యక్తికి అమ్మితే, ఎకరం భూమి కొన్న ‘బీ’ అనే వ్యక్తి పేరు మీద కొత్త ఖాతా తెరిచి ఆ ఎకరం భూమిని నమోదు చేసేవారు. కానీ, ‘ఏ’ ఖాతాలో ఉన్న రెండెకరాల నుంచి ఎకరం భూమిని తొలగించే వారు కాదు. దీంతో అదే సర్వే నంబర్‌లోని భూమి ఇద్దరు రైతుల ఖాతాల్లో నమోదయ్యే ది. ‘ఏ’ పేరిట రెండెకరాలు, ‘బీ’ పేరిట మరో ఎకరం రికార్డయ్యేది.
దీంతో రైతుల ఖాతాలతో పాటు ఆ సర్వే నంబర్‌లో ఉండాల్సిన భూమి కన్నా ఎక్కువ భూమి రికార్డు అయ్యేది. ఎవరైనా పట్టాదారు చనిపోయిన పక్షంలో వారసుల పేరిట భూమి మ్యుటేషన్ చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. చనిపోయిన వ్యక్తి ఖాతాలను అలానే ఉంచి, వారసుని పేరిట మరో ఖాతా తెరచి అదే భూమిని నమోదు చేసేవారు. లేదంటే చనిపోయిన వ్యక్తి పేరిట ఆ ఖాతాను అలాగే కొనసాగించేవారు కానీ వారసుడి పేరిట (పౌతి) మార్పు చేసేవారు కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో కుప్పలు తెప్పలుగా ఈ సమస్యలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు దాదాపు 10 లక్షల వరకు నమోదయ్యాయని ప్రక్షాళన గణాంకాలు చెపుతున్నాయి. అయితే, ప్రక్షాళనలో ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించినా భవిష్యత్తు లావాదేవీలు కూడా మాన్యువల్‌గా ఉంటే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి కావడంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి జరిగే క్రయ, విక్రయ లావాదేవీలన్నింటినీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ‘మార్పుల రిజిస్టర్’లో నమోదు చేయాలని ఆదేశించింది.
ఖాతా తొలగింపు.. పేరు మార్పు
ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఈ విధానం ద్వారా ప్రత్యేక నమూనాలో ఆన్‌లైన్ రిజిస్టర్‌ను తయారు చేశారు. అందులో భూమి రిజిస్ట్రేషన్ నంబర్, తేదీతో పాటు అమ్మేవారి పేరు, తండ్రి/భర్త పేరు, కొనేవారి పేరు, తండ్రి/భర్త పేరు, లావాదేవీ స్వభావం, సర్వే, ఖాతానంబర్లు, విస్తీర్ణం, మార్పు చేసిన రికార్డు నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అదే పౌతి విషయంలో చనిపోయిన పట్టాదారు పేరు, తేదీ, వారసుల పేరు ను మార్పు చేస్తారు. దీంతో ఫలానా ఖాతాలో ఈ ఆన్‌లైన్ రిజిస్టర్‌లో మార్పులు జరిగితే దానంతట అదే ఖాతా మారిపోనుంది. దీం తో డబుల్ ఖాతాల సమస్యకు తెరపడనుంది. అలాగే వారసుల పేరిట పట్టాల మార్పు ప్రక్రియ కూడా సులభతరం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment