మోదం.. ఖేదం  | భుత్వం భాషా పండితు | Sakshi
Sakshi News home page

మోదం.. ఖేదం 

Published Sat, Feb 9 2019 8:13 AM | Last Updated on Sat, Feb 9 2019 8:13 AM

భుత్వం భాషా పండితు - Sakshi

శుక్రవారం తిమ్మాపూర్‌ ఎమ్మార్సీ కేంద్రం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లు

పదిహేనేళ్ల నిరీక్షణకు తెరపడింది. దశాబ్దంన్నర కాలంగా పదోన్నతులకు నోచుకోకుండా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్‌–2 హోదాలో పనిచేస్తున్న భాషా పండితులకు, పీఈటీలకు తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో స్కూల్‌ అసిస్టెంట్‌ హోదా దక్కనుంది. అయితే ఎస్‌జీటీలకు పదోన్నతులు కల్పించకపోవడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్‌జీటీలకు ఓటు హక్కు లేనందునే ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శిస్తున్నారు. 

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: గత కొంత కాలంగా పదో న్నతులు కల్పించాలని వివిధ తీరుల్లో ఉద్యమాలు చేసిన భాషా పండితులకు ఊరట లభించింది. 2012 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భాషా పండితులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తే స్పందించిన ప్రభుత్వం నాడు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో చర్చలు జరిపింది. జీవో నెం.17, 18ను తీసుకవచ్చి పదోన్నతులకు పచ్చజెండా ఊపడంతో భాషా పండితులు దీక్షను విరమించారు. ఇంతలోనే సదరు జీవోలపై వేరే ఉపాధ్యాయ సంఘాలు కోర్టుకు వెళ్లడంతో భాషా పండితుల పదోన్నతుల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

15 ఏళ్లుగా వివాదాల పేరిట భాషా పండితులకు పదోన్నతులు ఇవ్వకపోవడంతో పదోన్నతుల ప్రక్రియ, వేతన వ్యత్యాసాలు తదితర లాభాలన్నింటిని కోల్పోయి ద్యోగ విరమణ పొందుతున్నారు. ఈ అంశంపై భాషా పండితులు తీవ్ర ఆవేదనకు గురవుతూ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో భాషా పండితులను అప్‌గ్రేడ్‌ చేస్తామని, త్వరలోనే శుభవార్త విననున్నారని సీఎం ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం మళ్లీ భాషా పండితుల పట్ల వివక్షత చూపుతూ ఏడాదిగా కాలయాపన చేయడంతో చేసేదేమీ లేక  నిరాశకు గురయ్యారు. తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సీఎంఓ ప్రత్యేక అధికారితో సమావేశమైన సీఎం కేసీఆర్‌ భాషా పండితుల దస్త్రాన్ని తెప్పించడం వారి సమక్షంలోనే పదోన్నతుల ఫైల్‌పై సంతకాలు చేయడంతో దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది.

ఉమ్మడి జిల్లాలో 1579 మందికి లబ్ది...
ప్రభుత్వం భాషా పండితుల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల 1579 మంది ఉపాధ్యాయులకు లబ్ది జరుగనుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 583 మంది హిందీ భాషోపాధ్యాయులు, 646 మంది తెలుగు ఉపాధ్యాయులు, పీఈటీలు 350 మందికి అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశం ఉంది. వీరికి స్కూల్‌ అసిస్టెంట్‌ హోదా దక్కనుంది.

ఎస్‌జీటీలు సమరానికి సై.. 
ప్రభుత్వం భాషా పండితులకు స్కూల్‌ అసిస్టెంట్‌ హోదా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యాహక్కు చట్టానికి భిన్నంగా, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించకుండా ఏకపక్ష నిర్ణయంతో భాషా పండితులకు స్కూల్‌ అసిస్టెంట్‌ హోదా కల్పించడం పట్ల మండిపడుతున్నారు. కేవలం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ తతంగానికి తెరలేపిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉన్నత పాఠశాలల్లో పనిచేసే భాషా పండితులు, పీఈటీల ఓట్లను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దండుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 20 సంవత్సరాల సర్వీసుకు పైగా కలిగి ఉన్న ఎస్‌జీటీలు ఆరు సంవత్సరాల సర్వీసు కలిగి ఉన్న వారి కన్నా వెనుకకు పోయే ప్రమాదంతో పాటు పదోన్నతుల ప్రక్రియ మున్ముందు గందరగోళంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయ వర్గాల్లో సింహభాగమైన సెకండరీ గ్రేడ్‌ టీచర్లు ప్రభుత్వ నిర్ణయంపై త్వరలోనే న్యాయస్థానాన్ని అశ్రయించడంతో పాటు భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. 

ఎస్‌జీటీలకూ పదోన్నతులు కల్పించాలి

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: రాష్ట్ర ప్రభుత్వం భాషా పండితులను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఎస్‌జీటీలను విస్మరించడం బాధాకరమని ఎస్‌జీటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి అన్నారు. పదోన్నతుల్లో ఎస్‌జీటీలను విస్మరించడంపై ఎస్‌జీటీ యూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ సెంటర్లలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడం, సమాజ పోకడలకు అనుగుణంగా విద్యావిధానం లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగు అవుతున్నాయని అన్నారు. సమాజం, ప్రభుత్వం, అధికారులు ప్రాథమిక విద్య స్థాయిలో బోధించే ఉపాధ్యాయులను బాధ్యులు చేస్తున్నారని పేర్కొన్నారు.

అభివృద్ధి చెందని దేశాలు ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో గురుకులాలు దేశానికి ఆదర్శం కాగా, ప్రభుత్వ ప్రాథమిక విద్య మాత్రం పూర్తిగా వెనుకబడి ఉందని విమర్శించారు. అప్‌గ్రేడేషన్‌ చేసిన పోస్టులలో అర్హతలు గల ఎస్‌జీటీలకూ అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతీకరించిన పండిట్‌ పోస్టులలో అర్హత గల ఎస్‌జీటీలకు అవకాశం కల్పించి, ప్రతి ప్రాథమిక పాఠశాలకు పీఎస్‌ హెచ్‌ఎంను నియమించడం వల్ల సీనియర్‌ ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాలలో శనివారం, ఈనెల 11న హైదరాబాద్‌లోని కమిషనర్, డైరెక్టర్, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు జి.నాగభూషణం, దాసరి శ్రీనివాస్, బి.శ్రీనివాస్, తిమ్మాపూర్‌ మండల నాయకులు శేఖర్, సంతోష్, ఉమాకుమారి, గాయత్రీలత, పద్మ, కవితారాణి, గంగయ్య, శ్రీనివాస్, జయశ్రీ, మంజుల, కిరణ్‌కౌర్, అస్రా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement