‘108’ సమ్మె షురూ!
సాక్షి, హైదరాబాద్: ‘108’లో సమ్మె సైరన్ మోగింది. తెలంగాణ కార్మిక శాఖ చొరవ చూపినా ఫలితం లేకుండా పోయింది. రెండోసారి కూడా చర్చలు విఫలమయ్యాయి. ఇటీవల మొదటి దఫా చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే. ‘108’ యాజమాన్యం జీవీకే-ఈఎంఆర్‌ఐ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బుధవారం కార్మికశాఖ చర్చలు నిర్వహించింది. ఉద్యోగుల 15 డిమాండ్లలో ఒక్కదానిని కూడా ఆమోదించకపోవడంతో అర్ధరాత్రి నుంచే సమ్మె ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ‘108’ అత్యవసర వైద్యసేవలు స్తంభించే అవకాశముంది.
కార్మికశాఖ కమిషనర్ డి.అజయ్ ఆధ్వర్యంలో రెండోసారి జరిగిన చర్చల్లో ఉద్యోగుల పక్షాన టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రూప్‌సింగ్, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, సలహాదారుడు జూపల్లి రాజేందర్, ప్రధానకార్యదర్శి జువ్వాడి శ్రీనివాస్, జీవీకే-ఈఎంఆర్‌ఐ జాతీయ ప్రతినిధి శ్రీనివాస్, రామచంద్రరాజు పాల్గొన్నారు. చర్చల్లో తెలంగాణ ‘108’ ఉద్యోగ నేతలెవరూ పాల్గొనకపోవడం గమనార్హం.
సమస్యల పరిష్కారానికి యాజ మాన్యం ముందుకు రాలేదని ‘108’ ఉద్యోగుల సంఘం నేత పల్లి అశోక్ వెల్లడించారు. కాలయాపన కోసం ఒక కమిటీ వేయాలని యాజమాన్యం కోరిందన్నారు. తొలగించిన ఉద్యోగులను తీసుకోబోమని జీవీకే స్పష్టం చేసినట్లు సమాచారం. 1800 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని, ‘108’ అంబులెన్స్ వాహనాలు 300 వరకు నిలిచిపోతాయని, అందరూ సహకరించాలన్నా రు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని జీవీకే యాజమాన్యం అన్నట్లు సమాచా రం.
కొంతమందే సమ్మెకు : మంత్రి
‘108’ సమ్మెలో కేవలం కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉందని, మెజారిటీ ఉద్యోగులు పాల్గొనడంలేదని, అందువల్ల సమ్మె ప్రభావం పెద్దగా ఉండద ని మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.