EMRI
-
‘108’ సమ్మె షురూ!
సాక్షి, హైదరాబాద్: ‘108’లో సమ్మె సైరన్ మోగింది. తెలంగాణ కార్మిక శాఖ చొరవ చూపినా ఫలితం లేకుండా పోయింది. రెండోసారి కూడా చర్చలు విఫలమయ్యాయి. ఇటీవల మొదటి దఫా చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే. ‘108’ యాజమాన్యం జీవీకే-ఈఎంఆర్ఐ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బుధవారం కార్మికశాఖ చర్చలు నిర్వహించింది. ఉద్యోగుల 15 డిమాండ్లలో ఒక్కదానిని కూడా ఆమోదించకపోవడంతో అర్ధరాత్రి నుంచే సమ్మె ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ‘108’ అత్యవసర వైద్యసేవలు స్తంభించే అవకాశముంది. కార్మికశాఖ కమిషనర్ డి.అజయ్ ఆధ్వర్యంలో రెండోసారి జరిగిన చర్చల్లో ఉద్యోగుల పక్షాన టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రూప్సింగ్, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్, సలహాదారుడు జూపల్లి రాజేందర్, ప్రధానకార్యదర్శి జువ్వాడి శ్రీనివాస్, జీవీకే-ఈఎంఆర్ఐ జాతీయ ప్రతినిధి శ్రీనివాస్, రామచంద్రరాజు పాల్గొన్నారు. చర్చల్లో తెలంగాణ ‘108’ ఉద్యోగ నేతలెవరూ పాల్గొనకపోవడం గమనార్హం. సమస్యల పరిష్కారానికి యాజ మాన్యం ముందుకు రాలేదని ‘108’ ఉద్యోగుల సంఘం నేత పల్లి అశోక్ వెల్లడించారు. కాలయాపన కోసం ఒక కమిటీ వేయాలని యాజమాన్యం కోరిందన్నారు. తొలగించిన ఉద్యోగులను తీసుకోబోమని జీవీకే స్పష్టం చేసినట్లు సమాచారం. 1800 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని, ‘108’ అంబులెన్స్ వాహనాలు 300 వరకు నిలిచిపోతాయని, అందరూ సహకరించాలన్నా రు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని జీవీకే యాజమాన్యం అన్నట్లు సమాచా రం. కొంతమందే సమ్మెకు : మంత్రి ‘108’ సమ్మెలో కేవలం కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉందని, మెజారిటీ ఉద్యోగులు పాల్గొనడంలేదని, అందువల్ల సమ్మె ప్రభావం పెద్దగా ఉండద ని మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. -
రూ.15 కోట్లు దుర్వినియోగం!
సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్య పరిశోధన సంస్థ (ఈఎంఆర్ఐ)లో అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ పూర్తి చేసింది. గత నాలుగేళ్లుగా దీనిపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం, నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 10 పేజీల ఫిర్యాదు లేఖ పోలీసు విభాగానికి ఇవ్వడంతో విచారణ చేపట్టారు. సుమారు ఐదు నెలల విచారణ అనంతరం ఇటీవల అవకతవకలు నిజమేనని ఏసీబీ నిగ్గుతేల్చింది. సుమారు రూ.15 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు ధ్రువీకరించింది. ఈ మేరకు నివేదిక అందజేసినా దీనిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు సాహసించలేదు. నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి వదిలేశారు. 108 నిర్వహణలో 95% నిధులు ప్రభుత్వం, 5 శాతం నిధులు నిర్వహణ సంస్థ చెల్లించాలనేది నియమం. అయితే 2009 చివరినుంచి 2011 వరకు రెండేళ్ల పాటు నిర్వహణ సంస్థ ఈ 5 శాతం నిధులు చెల్లించనట్టుగా ఏసీబీ గుర్తించిందని ఒక ఉన్నతాధికారి చెప్పారు. నెలకు రూ.35 లక్షల చొప్పున రెండేళ్లు ఇవ్వలేదు. అంతేకాకుండా ఈఎంఆర్‌ఐలో హెచ్ఆర్ మేనేజ్మెంట్తో పాటు పలు చిన్న చిన్న కాంట్రాక్టులను కూడా నిర్వహణ సంస్థ సొంత బంధువర్గానికే ఇచ్చుకున్నట్టు తేల్చారు. ఖరీదైన కార్లు కొన్నారని, 108 నిధులతో ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఆ సమయంలో ఉన్న కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్లపైనా చర్యలు తీసుకోవాలని, 108 నిర్వహణా సంస్థలోని ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, దుర్వినియోగమైన సొమ్మును రెవెన్యూ రికవరీ చట్టం కింద కేసులు నమోదు చేసి వసూలు చేయాలని ఏసీబీ సూచించింది. మరో రెండు పనులు నామినేషన్‌పై జీవీకేకు 108 అంబులెన్సుల నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుగుతుండగానే మరో రెండు పనులను నామినేషన్ పద్ధతిలో జీవీకేకు అప్పగించడంపై ఆరోపణలు విన్పిస్తున్నాయి. బాలరత్న సంజీవని (ఏజెన్సీ ప్రాంతాల్లో స్కూలు విద్యార్థులకు వైద్యసేవలు), డ్రాప్ బ్యాక్ పాలసీ (గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లడం, ప్రసవం తర్వాత తిరిగి ఇంటికి చేర్చడం) పనులను జీవీకేకు ఇచ్చారు. ఈ రెండు పథకాలకు సుమారు రూ.11 కోట్ల ఖర్చు అవుతుంది. ఈ పనులకు టెండర్లు పిలిచి అప్పగిద్దామని లేదంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో ఇవ్వాలని కుటుంబ సంక్షేమశాఖ ప్రతిపాదన పంపింది. కానీ ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో ఈ రెండు పనులను సదరు సంస్థకు అప్పగించింది. జీవీకే యాజమాన్యానికి ఏకపక్షంగా నిర్వహణ బాధ్యతలు అప్పజెబుతున్నారన్న కారణంగానే సీఎంతో అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విభేదించారు. ఇప్పుడు ఏసీబీ నివేదికపై చర్యలు తీసుకోకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.