శ్రీరస్తు...శుభమస్తు
కొడంగల్ (మహబూబ్‌నగర్) : కష్టపడి సంపాదించిన సొమ్ముతో పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో రాజస్తాన్‌లోని అజ్మీర్‌కు చెందిన అజ్జూభాయి కుల, మతాలకతీతంగా గురువారం కొడంగల్‌లో 11జంటలకు ఉచిత వివాహాలు చేయించారు. పహాలా కదమ్ (మొదటి అడుగు) అనే సంస్థను ఏర్పాటు చేసి, కొడంగల్ మండలం చిట్లపల్లి అబ్దుల్ సాహెబ్ దర్గా ఆవరణలో పెళ్లిళ్లు జరిపించడానికి ఆయన శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా దరఖాస్తు చేస్తుకున్న పేదలకు సొంత ఖర్చులతో ఆరు హిందూ జంటలు, ఐదు ముస్లిం జంటలకు పెళ్లిళ్లు జరిపించారు. అలాగే నూతన వధూవరులకు బట్టలు, మంచం, బీరువా, పరువు, దిండ్లు, తాళి, మెట్టలు, కాళ్ల పట్టీలు, పెళ్లి సామగ్రి, భోజనం తదితర వాటిని సమకూర్చి ఘనంగా వివాహాలు జరిపించారు.
వదూవరులకు వారి మత సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చేయించారు. ఈ వేడుకలకు పలు పార్టీల నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముద్దప్ప దేశ్‌ముఖ్, ఏన్గుల భాస్కర్, ముదిగండ్ల కృష్ణ, మధుసూదన్‌రెడ్డి, ఆర్.బస్వరాజు, దామోదర్‌రెడ్డి, ఎస్‌ఎమ్ గౌసన్, నాగరాజు, రాంరెడ్డి, చుక్కయ్య, ఆశప్ప, ప్రవీణ్‌కుమార్, కరెంటురాములు పాల్గొన్నారు.