
సాక్షి, చెన్నై: ప్రతి మతంలోనూ ఉగ్రవాదులు ఉన్నారనీ, తాము పవిత్రులమని ఎవ్వరూ చెప్పుకోలేరని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ శుక్రవారం అన్నారు. అరెస్టుకు తాను భయపడటం లేదనీ, కానీ తనను అరెస్టు చేస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేనుద్దేశిస్తూ కమల్ దేశంలో తొలి తీవ్రవాది హిందువేననడం వివాదమైంది. శుక్రవారం కోయంబత్తూరులోని సులూరులో కమల్ ప్రచారం చేయాల్సి ఉండగా, ఆదివారం నాటి వ్యాఖ్యల కారణంగా ఆయనకు ప్రచారానికి అనుమతి లభించలేదు. దీంతో కమల్ ట్విట్టర్ ద్వారా ప్రజలను ఓట్లు అడిగారు. తాను ఆ వ్యాఖ్యలు చేయడం అరవకురిచ్చిలోనే తొలిసారి కాదనీ, లోక్‌సభ ప్రచారం సమయంలో చెన్నైలోనే ఇదే మాట అన్నా అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదని కమల్ చెప్పారు.