సాక్షి, హైదరాబాద్: బస్సులు.. రైళ్లు.. ప్రైవేటు ట్రావెల్స్.. ఎక్కడ చూసినా జనమే జనం.. చిన్నాపెద్ద, పిల్లాజెల్లా.. అంతా కదులుతున్నారు.. ముఖంలో పండుగ సంబురం నింపుకొని పల్లెకు తరలుతున్నారు! సద్దుల బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నగరవాసులు పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. వారం రోజులుగా సుమారు 12 లక్షల మంది ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు బయల్దేరి వెళ్లారు. ఏపీ కంటే తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఈ నెల 20 నుంచి పిల్లలకు స్కూలు సెలవులు ప్రకటించడంతో నగరవాసుల పల్లెబాట మొదలైంది. రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడుతున్నాయి. మరో రెండ్రోజులు ఇదేస్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచే కాకుండా ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్, మియాపూర్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, లక్డీకాపూల్ తదితర చోట్ల నుంచి కూడా ప్రయాణికులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 3,500 బస్సులతోపాటు గత నాలుగు రోజులుగా ఆర్టీసీ సుమారు 1000 ప్రత్యేక బస్సులను నడిపింది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తదితర ప్రాంతాల వైపు వెళ్లే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది.
రైళ్లల్లో రిజర్వేషన్లు లభించకపోవడంతో పలువురు దూరప్రాంతాలకు సైతం ప్యాసింజర్ రైళ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. రైళ్లపై ఆశలు వదులుకున్న వాళ్లు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. అయితే ప్రత్యేక బస్సులపై 50 శాతం చొప్పున ఆర్టీసీ అదనపు వసూళ్లకు పాల్పడింది. ప్రైవేట్ బస్సులు ఏకంగా డబుల్ చార్జీలు వసూలు చేశాయి. రోజువారీగా బయల్దేరే 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాకుండా, వివిధ ప్రాంతాల మధ్య దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మరో 50 రైళ్లను అదనంగా ఏర్పాటు చేసింది. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో ప్రధాన రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. అయినా రద్దీ తగ్గడం లేదు.
‘మిలియన్’ మార్చ్
Published Wed, Sep 27 2017 1:42 AM | Last Updated on Wed, Sep 27 2017 10:40 AM
Advertisement
Advertisement