పేదలందరికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచింది. మహానేత మరణం తర్వాత క్రమక్రమంగా ఆరోగ్య శ్రీ పథకంలో కోతలు విధిస్తూ వచ్చింది. వైఎస్ కంటే ముందు ఉన్న చంద్రబాబు హయాంలో ఓ రిక్షా కార్మికుడికి గుండెపోటు వచ్చిందంటే ఇక అంతే సంగతులు. బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే లక్షలు ఖర్చు చేయాల్సిందే.
అందుకోసం ఉన్న కొద్దిపాటి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. లేకపోతే వారి ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిం దే. వీరి బాధలను దృష్టిలో ఉంచుకున్న మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో తెల్లకార్డు ఉన్న ప్రతి నిరుపేదకు లక్షల్లో ఖర్చు అయ్యే బైపాస్ సర్జరీ, లాప్రోస్కోప్, కాళ్లు, చేతులు విరిగినప్పుడు అతికించడానికి అయ్యే సర్జరీలు అన్నీ ఉచితంగా చేసేలా ఏర్పాట్లు చేశారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల నిరుపేదలంతా.. తమకేమీ కాదులే, అన్నీ ఆయనే చూసుకుంటారు.. అనే గుండె ధైర్యంతో బతికారు.
ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారంతా ఆయనను గుండె ల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. వైఎస్సై తమ దేవుడంటూ నిత్యం కొలుస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో తర్వాత అధికారం చేపట్టిన నేతలు ఈ పథకం పట్ల నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. మెల్లమెల్లగా ఈ పథకం నుంచి 133 వ్యాధులను తొలగిం చారు. వైఎస్ బతికి ఉన్నప్పుడు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేలా తగిన ఏర్పాట్లు చేయగా ఆ తర్వాత వచ్చిన పాలకులు క్రమక్రమం గా ఈ పథకాన్ని అటకెక్కించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న ఆస్పత్రుల్లో పేదవారికి సరైన సదుపాయాలు సైతం కల్పించడం లేదని రోగులు, ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ నిర్ణయం చిన్నారులకు శాపం...
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమారెడ్డి పెట్టిన ఆంక్షలు చెవిటి, మూగ పిల్లలు చాలా మందికి శాపంగా పరిణమించా యి. ఈ ఆంక్షల వల్ల రూ. 6లక్షల విలువైన క్లాక్ ఇయర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్‌లు కోల్పోయారు. దీని వల్ల వారు శాశ్వతంగా చెవిటి, మూగ వారిగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. వైఎస్ బతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలోనే సుమారు 40 వేల మందికిపైగా లబ్ధి పొందగా, ఆయన మరణించిన తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వచ్చారు.
నిధుల మంజూరులో నిర్లక్ష్యం...
వైఎస్ మరణించిన తర్వాత ఆరోగశ్రీ పథకానికి సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల వారు ఈ పథకాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రెండు, మూడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో తప్ప ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడా అమలు కావడం లేదు. ఈ పథకంలో పని చేసే సిబ్బందికి కూడా ప్రస్తుతం వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీలో సరిగ్గా వైద్యం అందడం లేదని, సరైన సదుపాయాలు కూడా కల్పించడం లేదని రోగు లు విమర్శలు చేస్తున్నారు. వైఎస్ హయాంలో ఈ పథకం కింద లబ్ధిపొందే వారికి రోగితో పాటు పక్కన ఉన్న వారికి కూడా నాణ్యమైన భోజనం అందించేవారు. కానీ ప్రస్తుతం నాసి రకం భోజనం అందిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. మహానేత ఉండగా అన్ని సంక్షేమ పథకాలు అందాయని, ప్రస్తుతం ఆ సంక్షేమమే కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనారోగ్యశ్రీ
Published Wed, Apr 30 2014 2:22 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM
Advertisement
Advertisement