
వికారాబాద్/ యాలాల(తాండూరు): దేవుడా మాపై ఎందుకు కక్ష గట్టావ్.. నాలుగేళ్ల క్రితం నా భర్తను, చిన్న కూతురును తీసుకెళ్లావ్.. ఇప్పుడు పెద్ద కుమార్తెను మృత్యుఒడికి చేర్చుకున్నావ్.. ఇంకా నేనెవరి కోసం బతకాలి.. ఎందుకు బతకాలి దేవుడా..’ అంటూ ఆ మాతృమూర్తి గుండెలవిసేలా రోదించిన తీరు హృదయవిదారకం. ఈ సంఘటన మండల పరిధిలోని ముద్దాయిపేటలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబీకులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాస్, బాలమణి దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం శ్రీనివాస్ అనారోగ్యంతో మృతిచెందడంతో బాలమణి వ్యవసాయ పనులు చేసుకుంటూ కూతుళ్లను పోషించుకుంటుంది.
ఆమె పెద్ద కూతురు మమత(14) స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. అయితే, పదిహేను రోజుల క్రితం మమతకు జ్వరం వచ్చింది. దీంతో బాలమణి కూతురును తాండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించింది. అయినా ఫలితం లేకపోగా జ్వరం తీవ్రత మరింత పెరిగింది. బాలికను వారంరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా కోమాలో ఉన్న మమత ఆదివారం రాత్రి మృతి చెందింది. తీవ్రమైన జ్వరం రావడంతో గుండెకు రక్తప్రసరణ జరగకపోవడంతో చనిపోయిందని వైద్యులు తెలిపారు. సోమవారం మమత మృతి విషయం తెలుసుకున్న ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
అయితే, తన కూతురుకు డెంగీ సోకి ఉండొచ్చని మృతురాలి తల్లి అనుమానం వ్యక్తం చేశారు. బాలిక మృతి విషయం తెలుసుకున్న పీహెచ్‌సీ వైద్యురాలు అశ్విని, సీహెచ్‌ఓ కిషన్ రాథోడ్ ముద్దాయిపేటకు వెళ్లి వివరాలు సేకరించారు. అయితే, బాలమణి కూతుళ్లలో నాలుగేళ్ల క్రితం చిన్న కూతురు శిరీష అతిసార సోకి చనిపోయింది. రెండో కూతురైన పోచమ్మ పుట్టుకతో అంధురాలు. సర్పంచ్ బిచ్చన్నగౌడ్, పాఠశాల హెచ్‌ఎం శివకుమార్, ఎస్‌ఎంసీ చైర్మన్ మహ్మద్ ఫరీద్ బాలమణి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment