17% సీట్లు అమ్మాయిలకే.. | 17 Percent Reservation For Women In IIT | Sakshi
Sakshi News home page

17% సీట్లు అమ్మాయిలకే..

Published Mon, Apr 8 2019 12:57 AM | Last Updated on Mon, Apr 8 2019 4:27 AM

17 Percent Reservation For Women In IIT - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఈసారి అమ్మాయిలకు 17 శాతం సీట్లను కేటాయించేందుకు ఐఐటీ కౌన్సిల్‌ కసరత్తు చేస్తోంది. గతేడాది సూపర్‌న్యూమరరీ కింద 779 సీట్లను పెంచి అమ్మాయిల ప్రవేశాలను 15.3 శాతానికి చేర్చిన ఐఐటీ కౌన్సిల్‌ ఈ సారి కనీసంగా 17% దాటేలా చూడాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా సీట్ల పెంపునకు చర్యలు చేపట్టింది. 2017–18 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో చేరిన అమ్మాయిల సంఖ్య 9.15 శాతమే ఉండటంతో దానిని 2020–21 విద్యా సంవత్సరం నాటికి కనీసంగా 20 శాతానికి పెంచాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) గతేడాది నిర్ణయించింది. ఇందులో భాగంగా 2018–19 విద్యాసంవత్సరం ప్రవేశాల్లో 14 శాతం సీట్లను కేటాయిస్తామని ప్రకటించింది. ప్రవేశాల కౌన్సెలింగ్‌లో రెగ్యులర్‌గా సీట్లు లభించిన వారు కాకుండా అదనంగా 779 మంది అమ్మాయిలకు ప్రత్యేక సీట్లను కేటాయించింది. దీంతో ఆ విద్యాసంవత్సరంలో ఐఐటీల్లో చేరిన అమ్మాయిల సంఖ్య 1,840కి చేరింది. ఇక ఈసారి (2019–20 విద్యా సంవత్సరం) 17 శాతం సీట్లను పెంచేందుకు ఐఐటీల కౌన్సిల్‌ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రవేశాలు పెంచేందుకు..
దేశవ్యాప్తంగా 2014–15లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అమ్మాయిల్లో కేవలం 8 శాతం మందికే ఐఐటీల్లో సీట్లు లభించాయి. 2015–16లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దాదాపు 4,600 మంది అమ్మాయిలు అర్హత సాధిస్తే అందులో 850 మందికే సీట్లు వచ్చాయి. 2016–17 విద్యా సంవత్సరంలోనూ దాదాపు అదే పరిస్థితి నెలకొంది. 2017–18 ప్రవేశాల లెక్కల ప్రకారం ఐఐటీల్లో 9.15 శాతం మంది అమ్మాయిలకే సీట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఐఐటీల్లో అమ్మాయిల సంఖ్య పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు
  
చర్యలు చేపట్టింది. వరుసగా మూడేళ్ల పాటు ప్రత్యేక సీట్లు కేటాయించి అమ్మాయిల ప్రవేశాలను కనీసంగా 20 శాతానికి చేర్చాలని కేంద్రం గతేడాది నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఐఐటీల్లో అమ్మాయిల సంఖ్యను పెంచేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. వీటిని సూపర్‌న్యూమరీ కింద ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. అబ్బాయిల సీట్లను తగ్గించకుండా అమ్మాయిలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయించింది. 2017–18 విద్యా సంవత్సరంలో చేరిన 9.15 శాతానికి 4.85 శాతం కలిపి కనీసంగా 14 శాతం మంది అమ్మాయిలకు ప్రవేశాలు లభించేలా సీట్లను పెంచింది. ఇక ఈసారి 17 శాతం సీట్లను కేటాయించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈసారి బీటెక్‌ కోర్సుల్లో చేరే అమ్మాయిల సంఖ్య 2 వేలు దాటనుంది.

పెరగనున్న సీట్లు..
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 11,279 సీట్లున్నాయి. వాటికి అదనంగా 779 సీట్లు చేర్చి 2018–19 విద్యా సంవత్సరంలో సీట్లను 12,058కి పెంచింది. ఈసారి కనీసంగా 17 శాతం కంటే ఎక్కువ మంది అమ్మాయిలకు సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. దీని ప్రకారం 2019–20 విద్యా సంవత్సరంలో అమ్మాయిలకు అదనంగా వేయి సీట్లు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది సీట్ల పెంపులో భాగంగా అత్యధికంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అమ్మాయిలకు 113 అదనపు సీట్లు లభించగా, హైదరాబాద్‌ ఐఐటీలో 57 అదనపు సీట్లు వచ్చాయి. దీని ప్రకారం ఈ సారి వాటి సంఖ్య మరింతగా పెరుగనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement