మురుగుశుద్ధి కేంద్రం (ఫైల్)
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని 185 చెరువులకు మురుగు నుంచి విముక్తి కల్పించేందుకు బృహత్తర ప్రణాళిక చేపడుతున్నారు. తద్వారా ఆయా జలాశయాలకు మహర్దశ పట్టనుంది. మహానగరం నలుమూలల్లో నూతనంగా 36 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించడం ద్వారా గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి మురుగు జలాలు ఆయా చెరువుల్లోకి చేరకుండా జలమండలి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసే బాధ్యతలను షా కన్సల్టెన్సీకి అప్పజెప్పారు. ఇందుకు సంబంధించి మరో రెండు నెలల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంకానుంది.
ఇటీవల మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎస్టీపీల నిర్మాణానికి అనువుగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అన్వేషించే బాధ్యతలను జలమండలి, రెవెన్యూ విభాగాలకు అప్పజెప్పారు. ప్రతి 5–6 చెరువులకు ఒకటి చొప్పున మురుగు శుద్ధి కేంద్రాలను, డైవర్షన్ మెయిన్ పైపులైన్లను ఏర్పాటుచేసి ఆయా జలాశయాల్లోకి చేరనున్న మురుగునీటిని దారిమళ్లించి శుద్ధిచేయనున్నారు. మొత్తంగా ఆయా మురుగు శుద్ధి కేంద్రాల్లో సుమారు వెయ్యి మిలియన్ లీటర్ల మురుగు జలాలను శుద్ధిచేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఆయా కేంద్రాల్లో శుద్ధిచేసిన మురుగు నీటిని గార్డెనింగ్, భవన నిర్మాణాల క్యూరింగ్, ఫ్లోర్‌క్లీనింగ్, టాయిలెట్ ఫ్లష్, వాహనాలు శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను వినియోగించనున్నారు.
గ్రేటర్ మురుగులెక్కలివీ...
గ్రేటర్ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న పరిధిని లెక్కిస్తే 1400 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ మహానగరం విస్తరించింది. ఈ పరిధిలో రోజువారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నిత్యం సుమారు 2000 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమౌతోంది. కానీ ప్రస్తుతం 21 మురుగు శుద్ధి కేంద్రాల్లో కేవలం వెయ్యి మిలియన్ లీటర్ల మురుగునీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. వీటిలో 17 ఎస్టీపీలను జలమండలి..మరో 4 ఎస్టీపీలను హెచ్‌ఎండీఏ నిర్వహిస్తోంది. మిగతా వెయ్యి మిలియన్‌లీటర్ల మురుగు నీరు గ్రేటర్ పరిధిలోని 185 చెరువులు, మూసీలోకి చేరుతుండడంతో ఆయా జలాశయాలు రోజురోజుకూ కాలుష్యకాసారమౌతున్నాయి. తాజాగా మురుగు మాస్టర్‌ప్లాన్ సిద్ధమవుతుండడంతో మహానగరవాసులతోపాటు ఆయా జలాశయాలకు మురుగు నుంచి విముక్తి లభిస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
సింగపూర్, ఆస్ట్రేలియా తరహాలో...
సింగపూర్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోని పలు మహానగరాల్లో మురుగు, వ్యర్థజలాల శుద్ధి..పునర్వినియోగంతో సహజవనరులపై వత్తిడి తగ్గించడంతోపాటు గ్రీన్‌బెల్ట్ పెంపొందించి సత్ఫలితాలు సాధిస్తున్న విషయం విదితమే. ఈనేపథ్యంలో మన గ్రేటర్ సిటీలోనూ ఇలాంటి వినూత్న విధానానికి జలమండలి శ్రీకారం చుట్టడం విశేషం.
పకడ్బందీగా సివరేజ్ మాస్టర్‌ప్లాన్
గ్రేటర్ నగరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఔటర్‌రింగ్ రోడ్డు పరిధి వరకు సమగ్ర మురుగునీటి మాస్టర్‌ప్లాన్ సిద్ధంచేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. దీంతో శివారు వాసులకు మురుగునీటితో అవస్థలు తప్పనున్నాయన్నారు. గ్రేటర్‌లో పర్యావరణ పరిరక్షణ, హరిత వాతావరణం పెంపొందించడం ద్వారా చెరువులు, కుంటలు తదితర విలువైన జలవనరులను కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment