ఎన్నెస్పీకి విద్యుత్‌ షాక్‌! | 2 crore power bill to N.S.P.CAMP | Sakshi
Sakshi News home page

ఎన్నెస్పీకి విద్యుత్‌ షాక్‌!

Published Sat, Jun 24 2017 4:03 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

ఎన్నెస్పీకి విద్యుత్‌ షాక్‌!

ఎన్నెస్పీకి విద్యుత్‌ షాక్‌!

స్థలాలు, భవనాలు లేకున్నా భారం మిగిలింది..
రూ.2 కోట్ల విద్యుత్‌ బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు
ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌రావు ఆరా..
 
ఖమ్మం అర్బన్‌:  ఎన్నెస్పీ అధికారులకు విద్యుత్‌ బిల్లుల భారం చుట్టుకుంది. ఏకంగా రూ. 2 కోట్లకు పైగానే విద్యుత్‌ బిల్లులు చెల్లించాలంటూ సదరు శాఖ నోటీసులు జారీ చేసింది. నగరంలో ఒకప్పుడు ఎవరికి భూమి కావాలన్నా ఎన్నెస్పీ మిగులు భూములు గుర్తుకొచ్చేవి. సుమారు 40 ఏళ్లకుపైగా ఓ వెలుగు వెలిగిన శాఖ ఇప్పుడు సొంత భవనాలు కోల్పోయి.. ప్రభుత్వం చూపించిన తాత్కాలిక ఇరుకు గదుల్లో నెట్టుకొస్తోంది. నగరంలోని గట్టయ్య సెంటర్‌కు ఆనుకొని ఎన్నెస్పీ క్యాంప్‌ ఉంది. దానికోసం సాగర్‌ కాల్వల సమయంలో భూ సేకరణ చేశారు.
 
సుమారు 94 ఎకరాలకుపైగా సేకరించి.. అందులో ఎన్నెస్పీ అధికారులు, సిబ్బంది నివాసం ఉండేందుకు సుమారు 800 వివిధ రకాల క్వార్టర్లు నిర్మించారు. అప్పుడు క్యాంప్‌ అంతటికీ ఒకే టాన్స్‌ఫార్మర్‌ అమర్చి.. దాని ద్వారా విద్యుత్‌ శాఖ అధికారులు రీడింగ్‌ తీసి ఎన్నెస్పీ శాఖ నుంచి వసూలు చేశారు. క్వార్టర్లలో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది మాత్రం చిన్న క్యార్టర్‌కు రూ.300, పెద్ద వాటికి రూ.500 వసూలు చేసేవారు. అయితే విద్యుత్‌ ఎంత వాడుకున్నా క్వార్టర్లలో ఉండే వారి వద్ద మాత్రం ఖరారు చేసిన పై మొత్తాన్ని వసూలు చేసేవారు. అది పోగా.. మిగిలిన మొత్తం బిల్లు ఎన్నెస్పీ ఖాతా నుంచి చెల్లించేవారు. తర్వాత ఆ క్వార్టర్లపై రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల దృష్టి పడింది. దీంతో ఎవరికి వారే తమ అధికారాన్ని ప్రదర్శించి.. క్వార్టర్లు కేటాయించుకుని నివాసం ఉన్నారు. వారికి తోడు ఉద్యోగుల పేరుతో ప్రైవేటు వ్యక్తులు కూడా దర్జాగా నివాసం ఉన్నారు. వారంతా నెలనెలా విద్యుత్‌ను అవసరం ఉన్న మేరకు దర్జాగానే వాడుకొని మినిమమ్‌ బిల్లు చెల్లిస్తూ వచ్చారు. మిగిలిన మొత్తాన్ని ఎన్నెస్పీ అధికారులు ఇన్నేళ్లుగా చెల్లించారు. క్వార్టర్లలో కొన్ని భవనాలు శిథిలం కావడంతో వాటిని ఖాళీ చేశారు. మరికొన్నింటిని అధికారులు గత ఏడాది బలవంతంగానే ఖాళీ చేయించచి.. మొత్తం క్వార్టర్లను కూల్చివేశారు. భవనాలు కూల్చివేసిన తర్వాత కూడా విద్యుత్‌ వాడకం, వాటికి సంబంధించిన బిల్లులు కూడా యథివిధిగానే వస్తున్నాయి. ఈ క్రమంలో కూల్చిన క్వార్టర్లను అధికారులు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదు. దీంతో అవి రూ.2కోట్లకుపైగా పేరుకుపోయాయి. తక్షణమే ఆ బిల్లులు చెల్లించాలని  విద్యుత్‌ అధికారులు తరచు లేఖలు పంపుతున్నారు.
 
మంత్రి హరీష్‌రావు ఆరా..
ఖమ్మంలోని ఎన్నెస్పీ క్యాంప్‌నకు ఉపయోగించిన విద్యుత్‌ బిల్లుల భారంపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరా తీసినట్లు తెలిసింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల శాఖపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో  విద్యుత్‌ బిల్లులపై చర్చించినట్లు తెలిసింది. ఎన్నెస్పీ పేరుతో కేటాయించిన విద్యుత్‌ కనెక్షన్లు వినియోగించే వాటిని ఉంచి.. మిగతా వాటిని విద్యుత్‌ శాఖకు తిరిగి ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం బకాయి ఉన్న రూ.2కోట్ల మొత్తాన్ని చెల్లించేందుకు తనకు నివేదిక పంపించాలని ఆదేశించినట్లు సంబంధిత ఓ అధికారి తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement