సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీలో లోక్‌సభ ఎన్నికల హడావిడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆలస్యం చేసిన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఆచీతూచీ వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఫలితాల్లో కోలుకోలేని దెబ్బతిన్న ఆ పార్టీ ఈసారి ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాల్లోనూ పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశాలుండడంతో ఈసారి అధికార టీఆర్‌ఎస్ పార్టీ కంటే ముందే లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది.
ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ కమిటీల ద్వారా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన పార్టీ అధిష్టానం, టీపీసీసీ నేతలతో కలిసి వచ్చిన దరఖాస్తులను వడబోసింది. ఈ క్రమంలో ఈ నెల 27న ఢిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల నుంచి ఇద్దరేసి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. స్క్రీనింగ్ కమిటీ ఎంపి క చేసిన అభ్యర్థుల పేర్లను కేం ద్ర ఎన్నికల కమిటీకి పంపి.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశాల తో మరో రెండ్రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో తమకే టికెట్ వస్తుందనే ఆశతో ఉన్న ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
పోటెత్తిన దరఖాస్తులు
లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తీవ్రమైన పోటీ నెలకొంది. జిల్లా కా>ంగ్రెస్ కమిటీ ఫిబ్రవరి 11 నుంచి 16వ తేదీ వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధి నుంచి 11, నాగర్‌కర్నూల్ నుంచి 36 దరఖాస్తులు వచ్చాయి. సామాజిక సమీకరణాలు, పార్టీ సీనియార్టీ, ఫాలోయింగ్‌తో పాటు ఒకవేళ ఓడినా పార్టీలోనే ఉంటారా? లేదా? అనే అంశాలపై సుదీర్ఘ అధ్యయనం చేసిన డీసీసీ మహబూబ్‌నగర్ నుంచి ఆరుగురిని, నాగర్‌కర్నూల్ నుంచి ఐదుగురిని ఎంపిక చేసి పీసీసీకి నివేదిక అందజేసింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆశావహుల పనితీరునే ప్రామాణికంగా తీసుకుని టికెట్లు ఖరారు చేయాలని భావిస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో పోటీకి సిద్ధమవుతోన్న ఆశావహుల్లో చాలా మంది సీనియర్లు కావడంతో వారిలో ఒకరిని ఎంపిక చేయడం స్క్రీనింగ్ కమిటీకి సవాల్‌గా మారింది.
ఇద్దరేసి చొప్పున ఎంపిక..
వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రెండు నియోజకవర్గాలకు ఇద్దరేసి నాయకులతో షార్ట్ లిస్టును తయారు చేసినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, శక్తి యాప్ జిల్లా కో–ఆర్డినేటర్ సంజయ్ ముదిరాజ్, కల్వకుర్తికి చెందిన బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చిత్తరంజన్‌దాస్, బాలానగర్‌కు చెందిన యువ నాయకుడు అనిరుధ్‌రెడ్డి, కేవీన్‌రెడ్డిలను ఎంపిక చేసిన డీసీసీ టీపీసీసీకి అందజేసింది. వీరిలో చిత్తరంజన్‌దాస్ పోటీకి విముఖత చూపుతున్నట్లు తెలిసింది. కాగా, వంశీచందర్‌కే దాదాపు టికెట్ ఖరారవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అలాగే నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ నంది ఎల్లయ్య, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవితో పాటు సతీష్ మాదిగ పేర్లు టీపీసీసీకి అందాయి. కానీ ఈ నెల 27న జరిగిన సమావేశంలో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి, వంశీచందర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ స్ధానం నుంచి సంపత్‌కుమార్, మల్లురవి పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇదీలావుంటే.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగర్‌కర్నూల్ సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య సైతం మళ్లీ బరిలో నిలవాలనే పట్టుతో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment