సాక్షిప్రతినిధి, నల్లగొండ : రెండు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై అధికార టీఆర్‌ఎస్ నాయకత్వం దృష్టి సారించింది. పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం తయారు చేయడానికి కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోగా ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకుల్లో కదలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా మార్చి నెలలో ‘పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక కమిటీ సమావేశాలు’ జరపాలని నిర్ణయించింది. జిల్లాలోని భువనగిరిలో మార్చి 2వ తేదీన, నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల సమావేశాన్ని 11వ తేదీన జరపనున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది.
ఊపును కొనసాగించేలా..
గతేడాది డిసెంబరులో జరిగిన శాసనసభ ముందుస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క హుజూర్‌నగర్ మినహా మిగిలిన సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడెం, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని ఆధిపత్యం ప్రదర్శించింది. ఇదే ఊపును వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించేలా వ్యూహరచన చేస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భువనగిరి ఎంపీ స్థానంలో విజయం సాధించగా,
నల్లగొండలో మాత్రం ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితం కావాల్సివచ్చింది. ఈ సారి ఆ పరిస్థితి తలెత్తకుండా ముందుగానే అప్రమత్తమవుతోంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం రెండు వేల మందిని, సమావేశం జరగనున్న నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి అదనంగా మరో వెయ్యి మందిని కలిపి మొత్తంగా 15వేల మందితో సన్నాహక కమిటీ సమావేశం జరపాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావం నుంచి నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని టీఆర్‌ఎస్ ఎప్పుడూ గెలుచుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను మూడో స్థానానికి నెట్టి కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. సాంకేతికంగా నల్లగొండ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైనా.. ఆ విజయం సాధించిన ఎంపీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉండడం, ఏడింట ఆరు సెగ్మెంట్లలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం కలిసి వస్తుందని భావిస్తున్నారు.
ఆలోచనలో పడేస్తున్న.. లీడ్
ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీ ఆలోచనలో పడేస్తోందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు చోట్ల గెలిచినా.. ఆ పార్టీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలు కలిపితే మొత్తం 1,07,692 ఓట్ల లీడ్ మాత్రమే ఉంది. హుజూర్‌నగర్‌లో 7,466 ఓట్ల మైనస్‌లో ఉంది. రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పదహారు చోట్ల విజయమే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు ప్రతీ స్థానం కీలకమైనదేనని పేర్కొంటున్నారు. ఈ కారణంగానే ఎన్నికల షెడ్యూలుకంటే ముందే సన్నాహక కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తోందని విశ్లేషిస్తున్నారు.
ఆశావహుల్లో.. హడావుడి
మార్చి 11వ తేదీన నల్లగొండ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు సెగెంట్లను నుంచి పార్టీ కేడర్‌ను సమీకరించి నిర్వహించనున్న సన్నాహక కమిటీ సమావేశంతో నల్లగొండ ఎంపీ టికెట్‌ను ఆశిస్తున్న నాయకుల్లో హడావుడి మొదలైంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానుండడంతో వీరు తమ ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. నల్లగొండ ఎంపీ టికెట్‌ను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి తదితరులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అయితే, నల్లగొండ నుంచి సీఎం కేసీఆర్ కూడా పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తిరిగి ఈ స్థానం నుంచి పోటీ చేస్తారా..? లేదా..? పార్టీ అగ్రనాయకత్వం ఏం ఆలోచనలు చేస్తోంది..? ఎవరికి టికెట్ దక్కే వీలుంది..? అన్న అంశాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
పార్లమెంటు పోరుకు.. సమాయత్తం!
Published Mon, Feb 25 2019 9:56 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment