కరెంటు తీగలు తెగిపడి 23 ఆవులు మృతి
కల్హేర్: కరువు పరిస్థితి నేపథ్యంలో గ్రాసం, నీరు దోరకకపోవడంతో వలస వచ్చిన ముగజీవాలను మృత్యువు కబళించింది. 11 కెవి విద్యుత్ లైన్ తీగ తెగిపడడంతో 23 పశువులు మృత్యువాత పడ్డాయి. ఆదివారం అర్థరాత్రి మెదక్ జిల్లా కల్హేర్ మండలం అంతర్‌గాంలో దుర్ఘటన జరిగింది. రైతులు కంగ్టీ మండలం ముకుంద్‌నాయక్ తండాకు చెందిన ధూంసింగ్, తుర్కవడ్‌గాం సాధుతండాకు చెందిన గోవింద్, గాజుల్‌పాడ్‌కు చెందిన రమేష్ కుటుంబాలతో కలిసి దాదాపు 300 పశువులను తీసుకుని వలస వచ్చారు. పగలంత పశువులను మేపి రాత్రి పూట ఓ వ్యవసాయ పోలంలో పశువులను కట్టి ఉంచారు.
ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తెగి పశువుల మందపై పడింది. దీంతో పశువులు విద్యుత్ షాక్‌కు గురయ్యాయి. పశువుల మంద అంతా ఓకే చోట ఉండడంతో ధూంసింగ్‌కు చెందిన 9 ఆవులు, గోవింద్‌కు చెందిన 13 ఆవులు, రమేష్‌కు చెందిన ఓ గేదే మరణించింది. పశువుల మృతి విషయం తెలిసి చుట్టు పక్క గ్రామల ప్రజలు నిర్ఘాంతపోయారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ సదాశివరెడ్డి సంఘటన స్థలన్ని సందర్శించారు. ఓక్కో పశువుకు రూ. 40 వేలు చోప్పున పరిహరం అందిస్తామని ప్రకటించారు.