సింగరేణిలో 242 ఉద్యోగాలు
త్వరలో నోటిఫికేషన్ విడుదల
గోదావరిఖని: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా దాదాపు 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన సింగరేణి జూన్‌లో మూడో ఎక్స్‌టర్నల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సంసిద్ధమైంది. ఈ మేరకు సంస్థ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. సింగరేణి కాలరీస్ కంపెనీలో త్వరలో మూడో ఎక్స్‌టర్నల్ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నామని, తద్వారా 242 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సీఎండీ ప్రకటించారు. ఈ ఎక్స్‌టర్నల్ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల కానుంది.
ఇప్పటికే సింగరేణి 2015 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిద్వారా 17 రకాల ఉద్యోగాలకు 2,201 మందికి పోస్టింగులను కూడా ఇచ్చింది. అలాగే, అంతర్గత నోటిఫికేషన్ ద్వారా 17 రకాల ఉద్యోగాలకు 1,000 మందిని ఎంపిక చేసింది. డిపెండెంట్ కేటగిరీలో సుమారు 2,000 మందికిపైగా ఉద్యోగావకాశాలు కల్పించింది. కాగా మరో 242 ఖాళీలను గుర్తించి వీటిని భర్తీ చేయడం కోసం మూడో ఎక్స్‌టర్నల్ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.
భర్తీ చేయనున్న ఉద్యోగాలివే: మూడో నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మైనింగ్ ఇంజనీర్ (మైనింగ్) 163 పోస్టులు, వెల్డర్ ట్రైనీ 46 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఫైనాన్స్ అండ్ ఎకౌంట్స్ 10 పోస్టులు, ఫార్మాసిస్టులు 7 పోస్టులు, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ 4 పోస్టులు, జూనియర్ టెక్నీషియన్ (ఎక్స్‌రే) 4 పోస్టులు, ఫిజియోథెరపిస్టు 4 పోస్టులు, జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే, గతంలో మాదిరిగానే ఈసారి కూడా కేవలం రాత పరీక్ష ద్వారానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఇంటర్వ్యూ ప్రక్రియ ఉండదని డెరైక్టర్ (పా) జె.పవిత్రన్‌కుమార్ తెలిపారు. పరీక్షలు పూర్తి పారదర్శక విధానంలో నిర్వహించడం జరుగుతుందని, పరీక్ష రాసిన రోజే ఫలితాలను కూడా ప్రకటించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.