గోదావరిఖని/సాక్షి, హైదరాబాద్ : పోలీసు శాఖలో 26 వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. అందులో 33 శాతం రిజర్వేషన్ ప్రకారం 8 వేల ఉద్యోగాలను మహిళలతో భర్తీ చేస్తామని వెల్లడించారు. బుధవారం గోదావరి ఖనిలో రూ.4.50 కోట్లతో నిర్మించనున్న మోడల్ పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం ఉండాలి.
అందుకే ముందుగా సబ్ డివిజన్, జిల్లా కేంద్రాల్లోని స్టేషన్లలో మహిళా పోలీసుల నియామకంపై దృష్టి సారిస్తాం..’’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్, రామగుండం నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, వరంగల్ ఐజీ నాగిరెడ్డి, కరీంనగర్ డీఐజీ రవి వర్మ, రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ తదితరులు పాల్గొన్నారు.
భర్తీ ఒకే దఫాలో కాకపోవచ్చు..
26 వేల పోస్టులను ఒకేసారి భర్తీ చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుందని, రెండుదశల్లో నియామకాలు జరిపితే సమస్య ఉండదని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. పోలీస్ శాఖ కూడా రెండు దశల్లో నియామకాలకే మొగ్గుచూపుతోంది. ఇందులో భాగంగా మొదటి దఫాలో 10 వేల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి కోసం డీజీపీ కార్యాలయం చర్యలు చేపట్టనున్నట్టు తెలిసింది.
దీంతోపాటు ప్రస్తుతం 11 వేల మంది సిబ్బంది శిక్షణలో ఉన్నారు. వారి శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రైనింగ్ కాలేజీలు బిజీగా ఉన్నాయి. 11 వేల మంది సిబ్బంది శిక్షణకే సమస్యలు ఎదురవుతున్నాయని, అలాంటిది ఒకేసారి 26 వేల పోస్టులు భర్తీ చేస్తే మరింత క్లిష్టంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోనుంది.