
డ్రగ్స్‌కు బానిసై.. పోలీసులకు పట్టుబడి..
ముగ్గురు బీటెక్ విద్యార్థులతోపాటు జోర్డాన్ దేశీయుడి అరెస్టు
2 కిలోల గంజాయి, కారు, బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం
కేసు వివరాలు వెల్లడించిన చేవెళ్ల డీఎస్పీ రంగారెడ్డి
చేవెళ్ల రూరల్ /పూడూరు: ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసై పెడదారి పట్టారు. వారికి జోర్దాన్ దేశీయుడు జతకలిశాడు. డ్రగ్స్ దొరకకపోవడంతో గంజాయి కొనుగోలు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. వీరు నలుగురితోపాటు గంజాయి సాగుచేస్తున్న రైతును పోలీసులు గురువారం రిమాండుకు తరలించారు. కేసు వివరాలను చేవెళ్ల డీఎస్పీ రంగారెడ్డి, సీఐ ఉపేందర్ వెల్లడించారు.
నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన నీలం ప్రత్యూష్, వినయ్‌కుమార్, రఘువంశీధర్‌రెడ్డిలు స్నేహితులు. వీరిలో ప్రత్యూష్, రుఘవంశీధర్‌రెడ్డిలు బీటెక్ పూర్తి చేశారు. వినయ్‌కుమార్ నగరంలో ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్నారు. వీరు ముగ్గురు డ్రగ్స్‌కు బానిసయ్యారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని దూల్‌పేటకు వెళ్లారు. అక్కడ డగ్స్ దొరకలేదు. అక్కడికి డ్రగ్స్ కోసం వచ్చిన జోర్డాన్ దేశానికి చెందిన సయ్యద్ మహ్మద్ సల్హా వారికి పరిచయమయ్యాడు. అక్కడున్న కొందరు పూడూరు మండలం కంకల్ గ్రామంలో ఓ రైతు వద్ద గంజాయి దొరుకుతుందని చెప్పారు. దీంతో నలుగురు కలిసి బుధవారం ప్రత్యూష్ కారు(ఐ 10)లో కంకల్‌కు వచ్చారు. గంజాయి సాగుచేస్తున ్న మల్లం సదానందం అలియాస్ ఆనందం, నందం వారికి రూ.3,500లకు కిలో గంజాయి విక్రయించాడు. విశ్వసనీయ సమాచారంతో చేవెళ్ల సీఐ ఉపేందర్, చన్గోముల్ ఎస్‌ఐ నాగరాజులు దాడి చేసి కంకల్- చన్గోముల్ రహదారిపై పట్టుకున్నారు. కారులోని కిలో గంజాయితోపాటు అది అమ్మిన రైతు సదానందం ఇంట్లో మరో కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గురువారం పోలీసులు, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు రైతు పొలంలో సాగుచేస్తున్న దాదాపు 25 గంజాయి మొక్కలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద ఉన్న సెల్‌ఫోన్లతోపాటు కారు, రైతు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు విద్యార్థులు డ్రగ్స్‌కు బానిపై దాని కోసం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లే దుస్థితికి దిగజారారని పోలీసులు తెలిపారు. విదేశీయుడు సయ్యద్ మహ్మద్ సల్హా విజిటింగ్ వీసాపై ఇండియా వచ్చాడు. అతడి వీసా గడువు మార్చి 15 వరకు ఉంది. గంజాయి సాగు చట్టవిరుద్ధం అని తెలిసినా రైతు సదానందం తొందరగా డబ్బు సంపాధించాలనే దురుద్దేశంతో గంజాయిని అంతర్ పంటగా సాగుచేస్తున్నాడని డీఎస్పీ రంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఐదుగురిని పోలీసులు రిమాండుకు తరలించారు. కాగా గత నెలలో ఓ కారులో కంకల్ గ్రామం నుంచి తరలిస్తున్న 8.5 కిలోల గంజాయిని వికారాబాద్ ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.