30వేల మందితో బందోబస్తు: సీపీ
అఫ్జల్‌గంజ్: గణేశ్ సామూహిక నిమజ్జనోత్సవానికి 30 వేల మంది పోలీసులను నియమించినట్టు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి సిద్దిఅంబర్‌బజార్‌లోని బహెతిభవ న్‌లో గణేశ్ సామూహిక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ట్రాఫిక్, సెక్యూరిటీ, ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ తదితర విభాగాల పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు.
ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూమ్ ద్వారా ఆయా ప్రాంతాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ మాట్లాడుతూ అశ్లీలతకు తావు లేకుం డా ఉండేందుకు నిమజ్జనోత్సవంలో డీజేను నిషేధించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్ణయించిందన్నారు.
భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంతరావు మా ట్లాడుతూ చార్మినార్ వద్ద మైకులు ఆపినా, ఊరేగింపును నిలిపివేసినా సహించేది లేదన్నారు. అవసరమైతే నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గణేశ్ ఊరేగింపును నిలిపేయాలని పిలుపునిచ్చేం దుకు సైతం భాగ్యనగర్ సమితి వెనుకాడబోదని హెచ్చరిం చారు. కార్యక్రమంలో నగర అదనపు కమిషనర్లు అంజలీకుమా ర్, జితేంద్ర, మల్లారెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ, అబిడ్స్ ఏసీపీ జైపాల్, జీహెచ్‌ఎంసీ సౌత్ జోన్ జోనల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం రెడ్డి, బేగం బజార్ కార్పొరేటర్ జి.శంకర్‌యాదవ్ పాల్గొన్నారు.
నగరానికి చేరుకున్న బలగాలు..
సాక్షి, సిటీబ్యూరో: నిమజ్జనాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు శుక్రవారం నగరానికి చేరుకున్నాయి. జంట పోలీసు కమిషనరేట్లకు చెందిన 15 వేల మందితోపాటు మరో 15 వేల మంది పోలీసు సిబ్బందితో నిమజ్జన బందోబస్తు నిర్వహించనున్నారు. గతంలో నగరంలో పనిచేసిన రిటైర్ అయిన అధికారుల సేవలను కూడా వినియోగించుకోనున్నారు. నగరంలో పనిచేసి, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని సైతం రప్పిస్తున్నారు.