భద్రాచలం : భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన రికార్డు నమోదైంది. ఇక్కడ సెప్టెంబర్ నెలలో 356 ప్రసవాలు జరిగాయి. భద్రాచలం ఏరియా ఆసుపత్రి నెలకొల్పిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఒకే నెలలో ఈ స్థాయిలో ప్రసవాలు జరగటం ఇదే ప్రథమం. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంవీ కోటిరెడ్డికి ఈ ఘనత దక్కినట్లైంది. కాగా కోటిరెడ్డి సూపరింటెండెంగ్‌గా పనిచేసిన కాలంలోనే గతంలో ఒకే నెలలో 350 ప్రసవాలు జరగగా, అప్పట్లో అది రికార్డుగా నమోదైంది. తిరిగి తన రికార్డును తన హయాంలోనే అధిగమించటం గమనార్హం.
వంద పడకలున్న భద్రాచలం ఏరియా ఆసుపత్రికి జిల్లాలోని ఏజెన్సీ మండలాల నుంచే కాకుండా పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా వైద్యం కోసం వస్తుంటారు. ఎక్కువగా గిరిజనులే ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రులను మినహాయిస్తే, ఈ స్థాయిలో డెలివరీలు నమోదైంది మరెక్కడా లేదు. మంగళవారంతో సెప్టెంబర్ నెల ముగియగా, మరో రెండుమూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ఆసుపత్రుల నుంచి జనన, మరణాల నివేదికలు వచ్చే అవకాశం ఉంది.
ఇలా నివేదికలు వచ్చిన తరువాత భద్రాచలం ఏరియా ఆసుపత్రి డెలవరీల రికార్డును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏజెన్సీకి ప్రధాన కేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఈ స్థాయిలో ప్రసవాలు జరగడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఇక్కడి వైద్యులను అభినందించారు. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డిని సాక్షి పలుకరించగా, ఇంత ఎక్కువగా ప్రసవాలు చేయటంలో డాక్టర్ పుల్లయ్య, గైనకాలజిస్టు విప్లవ కృషి ఎంతో ఉందన్నారు.
డాక్టర్ పుల్లయ్య అదనపు డీఎంహెచ్‌వోగా ఏజెన్సీ ఆసుపత్రులను పర్యవేక్షిస్తూనే ఏరియా ఆసుపత్రి పరిస్థితి దృష్ట్యా ప్రసవాలను చేసేందుకు రావటం ద్వారానే అరుదైన రికార్డు లభించిందని, ఇది వారిద్దరికే దక్కుతుందని అన్నారు. అలాగే సిబ్బంది కృషి కూడా ఉందని, బుధవారం ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందికి అభినందన సభ ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇక్కడే ఉంటారా..?
సూపరింటెండెంట్‌గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కోటిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయినందున కీలకమైన పోస్టులో ఉండేందుకు వీల్లేదని, కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్థానంలో మరొకరికి నియమించేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. నేడో, రేపో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అయితే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న అధికారిని కొనసాగించేలా జిల్లా ఉన్నతాధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
రికార్డు బ్రేక్
Published Wed, Oct 1 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement