కృష్ణా నీటి పంపకంపై బ్రజేష్ ట్రిబ్యునల్ ముందు వాదించనున్న రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి మొత్తం జలాల లభ్యతను సమీక్షించి నాలుగు రాష్ట్రాలకూ (మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ) తిరిగి పంపకం చేసేలా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. రాష్ట్రంలోని పరివాహక ప్రాంతం ఆధారంగా దక్కాల్సిన న్యాయమైన వాటా ట్రిబ్యునల్ తీర్పులో రాని దృష్ట్యా కొత్తగా కేటాయింపులు జరపాల్సిన అవసరాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచనుంది. ఈ నెల 25 నుంచి ఢిల్లీలో ట్రిబ్యునల్ నాలుగు రాష్ట్రాల వాదనలు విననుంది. కృష్ణా జలాల వివాదాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కాకుండా, నీటిని వినియోగించుకుంటున్న నాలుగు రాష్ట్రాలనూ భాగస్వాములు చేయాలని రాష్ట్రం కోరనుంది.
నాలుగు రాష్ట్రాలకూ కొత్త కేటాయింపులు?
కృష్ణా నదీ జలాల వివాదాన్ని విచారిస్తున్న బ్రజేష్ ట్రిబ్యునల్ గత నెల 7న జరిపిన విచారణ సందర్భంగా విచారణను కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేయాలా? మహారాష్ట్ర, కర్ణాటకలను కలిపి విచారించాలా? అన్న అంశాన్ని తేల్చందుకు ముసాయదా విధివిధానాలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇందులో పేర్కొన్న మేరకు విచారణను రెండు రాష్ట్రాలకే పరిమితం చేసి ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలా? లేక నాలుగు రాష్ట్రాలకూ తిరిగి కేటాయించాలా?, తక్కువ నీటి లభ్యత ఉన్న సమయాల్లో ఆపరేషన్ ప్రొటోకాల్ ఎన్ని రాష్ట్రాలకు ఉండాలి? అన్న అంశాలపై అన్ని రాష్ట్రాలు ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు వాదనలు వినిపించనున్నాయి.
నీరు తక్కువ ఉన్న ఏడాదుల్లో ఏ ప్రాజెక్టు నుంచి ఎంతనీరు, ఎవరు ఎవరికి విడుదల చేయాలన్న నిర్దేశాలను బచావత్ కానీ, బ్రజేష్ కానీ చెప్పలేదని రాష్ట్రం పేర్కొంది. ఈ దృష్ట్యా కరువు పరిస్థితుల్లో తమకు తక్కువ నీటి లభ్యత ఉన్న సమయాల్లో ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి నీటి విడుదల చేయాలని, దిగువ రాష్ట్రమైన ఏపీకి మిగిలిన మూడు రాష్ట్రాలూ నీరు విడుదల చేయాల్సి ఉంటుందని రాష్ట్రం తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఏయే ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయవచ్చు, అది ఎంత మేరకు? అన్న దానిపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది తేలాలంటే నాలుగు రాష్ట్రాలను విచారించాలని రాష్ట్రం చెప్పనుంది.
పరీవాహకం ఎక్కువ...వాటా తక్కువ
కృష్ణా పరివాహక ప్రాంతం తమకు 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో 35 శాతం మేర మాత్రమే ఉన్నాయని రాష్ట్రం వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పరీవాహకం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. మొత్తం జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయింపులు జరిపిన దృష్ట్యా పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకొని తమకు కేటాయింపులు పెంచాలన్నది రాష్ట్ర వాదనగా ఉంది.
4 రాష్ట్రాలకూ తిరిగి కేటాయించాల్సిందే
Published Thu, Feb 19 2015 3:45 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement