డోలాయమానంలో 400 ఎంబీబీఎస్ సీట్లు
4 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వసతులు లేవన్న ఎంసీఐ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నాలుగు ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 400 ఎంబీబీఎస్ సీట్ల మంజూరీలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా (ఎంసీఐ) ఎటూ తేల్చలేదు. ఈ ఏడాది ఈ సీట్లను కొనసాగించే విషయమై ఇప్పటివర కు ఆమోదం కూడా తెలపలేదు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి వైద్య మహిళా కళాశాల, మల్లారెడ్డి వైద్య కళాశాలలకు చెందిన 300 ఎంబీబీఎస్ సీట్లపై గందరగోళం నెలకొంది. మెడిసిటీ వైద్య కళాశాలకు చెందిన 50, ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలలకు చెందిన 50 సీట్లపై అస్పష్టత నెలకొంది. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ఆయా కళాశాలల్లో అవసరమైన వసతులు లేకపోవడంతో ఎంసీఐ అభ్యంతరం తెలి పింది. ప్రధానంగా లేబొరేటరీ, పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది, ఇతరత్రా సదుపాయాలు ప్రమాణాల ప్రకారం లేవని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ సీట్లపై ఎంసీఐ ఆమోదం తెలపడానికి వచ్చే నెల 15 వరకు సమయముందని ఆయా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఎంసీఐ కోరుకున్న విధంగా వసతులు కల్పించామని, ఈ సీట్లకు అనుమతి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల్లో ఆందోళన...
400 ఎంబీబీఎస్ సీట్లు డోలాయమానంలో పడడంతో వైద్య విద్యలో ప్రవేశించాలనుకున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వాటిల్లోని 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాలోని 60 సీట్లను డబ్బులు ఇచ్చి సీట్లు పొందినవారు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే 35 శాతం చొప్పున ప్రైవేటు యాజమాన్య సీట్లకు మూడో తేదీన ప్రత్యేక ఎం-సెట్ జరుగుతోన్న విషయం విదితమే. ఆ ప్రకారం ఈ నాలుగు కాలేజీల్లోని 140 సీట్లలో కొన్నింటిని కొందరు విద్యార్థులు డబ్బు ఇచ్చి బుక్ చేసుకున్నట్లు సమాచారం. వారూ ఆందోళన చెందుతున్నారు. ఏకంగా 400 సీట్లు తగ్గడంతో యాజమాన్య కోటా కోసం పరీక్ష రాసే విద్యార్థులు తీవ్ర నిరాశ పడే పరిస్థితి నెలకొంది. ప్రైవేటు కళాశాలలు డబ్బులు వసూలు చేస్తున్నాయే కానీ ఎంసీఐ నిబంధనలు పాటించడంలో శ్రద్ధ చూపకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు.
మరో రెండు కాలేజీలకు 100 సీట్లు
ఇదిలావుండగా రాష్ట్రంలోని రెండు ప్రైవేటు వైద్య కళాశాలలకు 100 సీట్లు పెంచుతూ ఎంసీఐ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఒక్కో కళాశాలకు 50 చొప్పున పెంచినట్లు సమాచారం. అయితే ఈ వివరాలు తెలియాల్సి ఉంది.